Life Imprisonment Accused in YSRCP Leader Murder Case:అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018 మార్చి 30వ తేదీన జరిగిన వైఎస్సార్సీపీ నేత కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ఏడుగురికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 2017 అక్టోబర్ 15వ తేదీన కందుకూరు గ్రామంలో పీర్ల పండుగ జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన శివారెడ్డి తన వాటర్ ట్యాంక్‌తో వెళ్తుండగా ఊరేగింపులో కొందరు వ్యక్తులు అడ్డు తగిలారు. పక్కకు తప్పుకోమని చెప్పినప్పటికీ వినకుండా వాదించారు. దీంతో శివారెడ్డి, బాలకృష్ణ వారి సోదరుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ జరిగిన సమయంలో బాలకృష్ణ పంచె ఊడిపోయింది. దీనిని ఆయన తీవ్ర అవమానంగా భావించాడు.
ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత రాజీ కూడా అయ్యారు. అయితే కేసు రాజీ అయినప్పటికీ బాలకృష్ణ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో 2018 మార్చి 30వ తేదీన శివారెడ్డి పొలం నుంచి ఇంటికి వస్తుండగా బాలకృష్ణ అతని సోదరులు వేటకుడవళ్లతో వెంటాడారు. శివారెడ్డి కుమారుడు భాను ప్రకాష్ రెడ్డి తన తండ్రిని చంపవద్దని వేడుకున్నప్పటికీ వారు వినలేదు. వేటకొడవళ్లతో వెంటాడి వేటాడి నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసులో మొత్తం పదిమందిపై కేసులు నమోదు చేశారు.