తెలంగాణ

telangana

ETV Bharat / press-releases

ఏపీ ప్రజలకు దీపావళి కానుక - ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముందే బుకింగ్స్

ఏపీలో సూపర్ సిక్స్​లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు - 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో పథకానికి ఆమోదముద్ర

Free Gas Cylinder In AP
CM Chandrababu on Free Gas Cylinder (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

CM Chandrababu on Free Gas Cylinder: ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకను ప్రకటించారు. సూపర్ సిక్స్​లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపావళి నుంచి శ్రీకారం చుట్టనుంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించనుంది. ఏడాదికి రూ.2 వేల 684 రూపాయల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దీపం పథకం గొప్ప ముందడుగని సీఎం అభివర్ణించారు.

రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే సుమారు 1.47 కోట్ల కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. వీరందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ. 3,640 కోట్లు ఖర్చవుతుంది. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేయనున్నారు.

ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు: సూపర్-6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజనలాగే ఏపీలో 1999 నుంచే దీపం పథకం కింద పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటినీ ఉజ్వల కింద పరిగణనలోకి తీసుకుని గ్యాస్ సిలిండర్‌కు 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏమీ తేల్చలేదు.

అయితే దీన్ని ఆమోదిస్తే దీపం, ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చవచ్చు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల రూపాయల భారం తగ్గుతుంది. ఐదేళ్లకు సుమారు 3 వేల కోట్ల మేర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కేంద్రం ఏమీ తేల్చనప్పటికీ, ఏపీ ప్రభుత్వం దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో దీపావళి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందనున్నాయి.

బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు : లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మహిళలకు ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు అవుతుందని ముఖమంత్రి చంద్రబాబు అన్నారు. వంట గ్యాస్ కోసం చేసే ఖర్చును గృహిణులు వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందలేదన్న విమర్శ రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూ.876 లుగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్​కు రూ.25ల సబ్సిడీ ఇస్తోందని అధికారులు చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉందన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల భారం పడుతుందన్నారు. ఐదేళ్లకు రూ.13 వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర పడనుంది.

బాలయ్య అన్​స్టాపబుల్ సీజన్ 4 - గెస్టుగా మరోసారి చంద్రబాబు - షూటింగ్ కంప్లీట్

ఏపీలో విధ్వంసం పోయి, నిర్మాణం ప్రారంభం - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details