YSRCP Leaders Joined Janasena: ఇటీవలే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ముగ్గురు సీనియర్ నేతలు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వారందరినీ పవన్ సాదరంగా ఆహ్వానించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచి, రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలారి రోశయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సామినేని ఉదయభాను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరామని, కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేస్తానని చేరికల అనంతరం సామినేని ఉదయభాను అన్నారు. జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్నారు.
Kilari Venkata Rosaiah Comments: మంచి ప్రభుత్వం, పరిపాలన కావాలని ప్రజలు భావించారని, అందుకే కూటమి పార్టీలకు అఖండ విజయం కట్టబెట్టారని కిలారి రోశయ్య అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావాలని నిర్ణయించామని, జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారని, అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యతని పవన్ గుర్తు చేశారని కొనియాడారు. గుంటూరు జిల్లాలో జనసేనలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Balineni Srinivasa Reddy Comments: మొదట్నుంచీ విలువలతో కూడిన రాజకీయాలు చేశానని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. తాను జనసేనలోకి వెళ్లడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని తెలిపారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని, అవన్నీ సర్దుకుంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత - జనసేన నేతల ఆందోళన, అరెస్టు - మళ్లీ రెచ్చిపోయిన నాని - Tension at Perni Nani House