YSRCP Leaders Irregularities in AP: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లుగా ఆ అక్రమాల రారాజు చెలరేగిపోతున్నారు. భూములను కబ్జా చేస్తున్నారు. చెరువులు, కాలువ కట్టల్లోని మట్టిని తవ్వేస్తున్నారు. కొండల్ని కొల్లగొడుతున్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించడం, అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విలేకర్లను బెదిరించడం ఆయనకు వెన్నతో పెట్టి విద్య. ఓ దళిత యువకుడి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడికి అండాదండా ఆయనే. ఈ అవినీతి రాజా వ్యవహారాలన్నీ ఆయనకు పిల్లనిచ్చిన మామ కనుసన్నల్లోనే కొనసాగుతాయి. ఈయన అనుచరులు సైతం తమ దందాల సొత్తును 'మామ'కే చేరవేస్తుంటారు.
తుని నుంచి కోటనందూరు మండలం అల్లిపూడి వరకు తాండవ నదిలో ఇసుకను పెద్ద ఎత్తున అక్రమంగా తవ్వేస్తున్నారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు నిత్యం కొన్ని వందల లోడ్లు తరలిస్తూ కోట్లు రూపాయలు అర్జిస్తున్నారు. సముద్ర తీరంలోని బొండు ఇసుకను సైతం వదలం లేదు.
వేమవరం, ఎర్రయ్యపేట, అన్నయ్యపేట, ఎల్లయ్యపేట, దానవాయిపేట తదితర గ్రామాల్లో బొండు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తూ సొమ్ములు వెనకేసుకుంటున్నారు. ఏలేరు, పోలవరం కాలువ గట్లపై ఉన్న మట్టి నిల్వలను అడ్డగోలుగా తవ్వేసి విక్రమిస్తున్నారు. చెరువుల్లో మట్టిని ఇటుక బట్టీ వ్యాపారులకు అమ్ముకున్నారు. చిన్నచిన్న కొండలు, గుట్టల్ని సైతం ఈ అయిదేళ్లలో కరిగించేశారు.
వైఎస్సార్సీపీ నేతల పాపాలు- పార్టీలో చేరలేదని టీడీపీ మద్దతుదారుడి కోళ్లఫారం కూల్చివేత
తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామ చెరువు గర్భంలోని వంద ఎకరాల్లో కోదాడ గ్రామ దళితులు కొన్ని దశాబ్దాలుగా పంటలు వేసుకుంటున్నారు. అందులోని 70 ఎకరాలను ఈ ప్రజాప్రతినిధి తనకు కావాల్సిన వ్యక్తికి కట్టబెట్టి తద్వారా భారీగా లబ్ధి పొందారు. ఈ భూమిలో సాగు చేసుకుని జీవిస్తున్న దళిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా వారిపై ఉక్కుపాదం మోపారు.
కోదాడలో మూడెకరాల గ్రామకంఠం భూమిని సబ్ డివిజన్ చేయించి తన అనుచరుడైన వైసీపీ నాయకుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత ఆ భూమిని జగనన్న కాలనీల కోసం ఎకరం రూ.40 లక్షలు చొప్పున ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. ఇలా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మేసి ఈ ఒక్క డీల్‌లోనే కోటికిపైగా కొల్లగొట్టారు.
తుని మండలం రాజుపేట వద్ద జగనన్న కాలనీ కోసం 110 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడున్న వాస్తవ ధర కంటే అనేక రెట్ల అధిక మొత్తానికి ప్రభుత్వంతో కొనిపించి కమీషన్ల రూపంలో భారీగా లబ్ధి పొందారు. ఎక్కడైనా విలువైన భూమి ఉంటే చాలు దానిపై కన్నేస్తారు. తామే కొంటామంటూ యజమానికి కొంత అడ్వాన్సు చెల్లిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆ అరాచక ప్రజాప్రతినిధి మామ తన భూమిని ఇలాగే లాక్కున్నారని ఆరోపిస్తూ పాయకరావుపేటకు చెందిన ఓ మహిళ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.