YSRCP Leaders Atrocities on Police : అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు పెట్రేగిపోతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వైఎస్సార్సీపీ నాయకులు ప్రచార కార్యక్రమంగా మలుచుకున్నారు. కార్యక్రమానికి ఇచ్చిన సమయం కంటే ఎక్కువ సేపు అధికార పార్టీ నేతల నిర్వహిస్తుంటే ఆపాలని పోలీసులు సూచనలు చేశారు. అంతే ఊగిపోయిన వైఎస్సార్సీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్ని కేసులు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చిపోయారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగి సైతం వత్తాసు పలకడం కొసమెరుపు.
శివరాత్రి వేడుకల నిర్వహణలో యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్న సమాచారమున్నా తాగు నీటి వసతి కల్పించలేకపోయారు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి నామస్మరణలో తరించారు. శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ప్రచార కార్యక్రమంగా మలుచుకున్నారు.
భూమనా ఇది తగునా? - తిరుమల పార్వేట మండపంలో వైసీపీ ప్రచారం!
అక్కడ పాటల కచేరీకి ఏర్పాటు చేసిన వేదికపై సీఎం జగన్, నియోజకవర్గ అధికార పార్టీ సమన్వయకర్త, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి డిజిటల్ పోస్టర్లను ప్రదర్శించారు. తమ పార్టీని ఆదరించాలంటూ ప్రచారంతో హుకుం జారీ చేశారు. దేవస్థానంలో పార్టీ జెండాలు వెలసినా దేవాదాయ శాఖ అధికారులు మిన్నకుండిపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగబోయే సిద్ధం సభను జయప్రదం చేయాలని, 330 బస్సులు ఏర్పాటు చేశామని అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ప్రతీ ఒక్కరు తప్పక హాజరై సభలు దిగ్విజయం చేయాలని, పదే పదే ప్రచార కార్యక్రమంగా పోరెత్తించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులు ఇదేమి కర్మరా బాబు అని ఛీ కొట్టారు.