YSRCP Leader Irregularities in Godavari Districts : ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోని ప్రాంతం అది. ఆ ఊళ్లో పుట్టడమే ఓ వరం అనుకుంటారు స్థానికులు! అలాంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఆయన్ని ఎన్నుకోవడమే వారికి శాపమైంది. సామాన్యుడికి ఏ హక్కులూ స్వతంత్రంగా పొందలేని ప్రాంతంగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎవరిపై అయినా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు కాదు. ఆయన ఫోన్ చేస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలో? వద్దో పోలీసులకు ఓ స్పష్టత వస్తుంది.
ఆయనకు కోపం వస్తే ఎదుటి పార్టీ నాయకురాలికి 70 ఏళ్లు దాటి ఉన్నా గుంపులోకి వచ్చి రాళ్లు వేశారంటూ ఫిర్యాదు అందుతుంది. ఎఫ్‌ఐఆర్(FIR)లో పేరూ నమోదవుతుంది. ఆయనకు నచ్చితేనే ఆ ఊళ్లో ఇల్లు కట్టుకోగలం. నచ్చకపోతే అధికారులు ఇంటి నిర్మాణానికి ఏదో ఒక అడ్డు చెబుతూనే ఉంటారు. ఆయన వాళ్లైతే మాత్రం అనుమతుల్లేకపోయినా ఏ అధికారీ అటు వైపు కన్నెత్తిచూడరు.
2019 ఎన్నికల సమయంలో ఆ పట్టణంలోనే పక్క నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఒక స్వీటు దుకాణం యజమాని ఇల్లు కట్టుకునేందుకు పునాదులకు గుంతలు తవ్వారు. ఇంతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మనం ప్రస్తావిస్తున్న నాయకుడు ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ స్వీటు దుకాణం యజమానిది ప్రత్యర్థి పార్టీ కావడంతో ఇల్లు కట్టుకోనివ్వనంటూ అడ్డుపడ్డారు. అనుమతులు ఇవ్వకుండా చేశారు.
YSRCP Irregularities on Opposition Leaders :ఇప్పటికీ ఆ ఇల్లు పునాదుల గుంతల దశలోనే ఉందంటే ఎంతటి కక్షతో ఉండి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా పని ఉండి ఆ ప్రజాప్రతినిధిని కలిస్తే భుజం మీద చనువుగా చెయ్యేసి నవ్వుతూ మాట్లాడతారు. కానీ 'ఏంటోనోయ్ నాకు గాజు గ్లాసులు గుచ్చుకుంటున్నాయి' అని వెటకారమాడతారు. అంటే- ఆయన అంతకుముందు ఎన్నికల్లో జనసేనకు పని చేశాడని అర్థమన్నమాట. అందువల్లే పని జరగదని పరోక్షంగా హెచ్చరిస్తారు.
తనకు ఓటేయని వారికి కార్యాలయాల్లో, పోలీస్‌స్టేషన్లలో ఇతరత్రా ప్రైవేటు వ్యవహారాల్లో పనులయ్యే పరిస్థితి లేకుండా కట్టడి చేశారు. ఆ ప్రజాప్రతినిధి చుట్టూ ఒక ప్రత్యేక బ్యాచ్ ఉంటుంది. అందులో రౌడీషీటర్లూ ఉంటారు. హత్య కేసుల్లో పాత్ర ఉన్న వారి కుటుంబాలవారూ ఉంటారు. సెటిల్‌మెంట్ వ్యవహారం కనీసం అరకోటి మించుతుందంటే చాలు ఆ బ్యాచ్ రంగంలోకి దిగిపోతుంది.
ఈ ప్రజాప్రతినిధి అండతో అందులో కొందరిపై ఉన్న రౌడీషీట్లు మాయమైపోయాయి. ఆ బ్యాచ్ భయపెట్టి, బెదిరించి ఎన్ని సెటిల్‌మెంట్లు చేసినా పోలీసులకు ఏం కనిపించదు, వినిపించదు.! దాంతో వారికి సత్ప్రవర్తన సర్టిఫికెట్లు జారీ చేసి మంచివారిగా ముద్ర వేయించేసుకున్నారు. ఆ ప్రజాపతినిధి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడి జనసేన(Jana Sena) గెలుపొందింది.
ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు : గెలిచిన వారు సంబరాలు చేసుకోవడం చూసి తట్టుకోలేక హుటాహుటిన తన అనుచరులతో కలిసి సినిమా లెవెల్లో ఆ ఊరికి వెళ్లిపోయారు. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు దిగారు. దొరికింది దొరికినట్లు ధ్వంసం చేశారు. 'మీ అంతు చూస్తామంటూ అనుచరగణం మధ్యలో ఉండి ఆ ప్రజాప్రతినిధి అరాచకం సృష్టించారు. లోకేశ్ యువగళం యాత్ర(Yuva Galam Yatra) నేపథ్యంలో ఆయనపై కిరాయి రౌడీలతో రాళ్ల దాడి చేయించారు.
ఈ సంఘటనలో టీడీపీ(TDP) నాయకులు, సాధారణ కార్యకర్తలు, పోలీసులు సైతం గాయపడ్డారు. మళ్లీ అవతలి వారిదే తప్పు అన్నట్లు కేసులు నమోదు చేయించారు. జగనన్న కాలనీల లేఅవుట్ల కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తుందని ముందే ఆ ప్రజాప్రతినిధికి తెలుసు. కొందరు రైతులను భయపెట్టి దాదాపు 70 ఎకరాల భూముల్ని అనుచరులూ, బినామీలతో కొనిపించేశారు.