Sharmila vs YS Jagan : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ తమకు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, పంపకాలపై చేసుకున్న ఒప్పందాన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్ చేసుకోవాలంటే జగన్‌కు, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడం ఏంటి అంటూ ఆమె జగన్‌కు గట్టి బదులిస్తూ రెండు పేజీల లేఖ రాశారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు ఆయన సోదరి, పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు. జగన్ రాసిన లేఖకు బదులుగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ లేఖను సంధించారు. తండ్రి ఆదేశాల్ని, అభిమతాన్ని గాలికొదిలేశారని, మాట తప్పి, మడమ తిప్పారంటూ జగన్ నైజాన్ని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. తన రాజకీయ ప్రయాణాన్ని నిర్దేశించడానికి మీరెవరంటూ ఎదురుదాడికి దిగారు. లేఖపై షర్మిలతో పాటు, తల్లి విజయమ్మ సంతకం చేశారు.
Sharmila Letter to YS Jagan : జరిగిన పరిణామాలన్నిటికీ తన తల్లి సాక్షి కాబట్టే ఆమె కూడా సంతకం చేసినట్టు షర్మిల వివరించారు. ‘ప్రియమైన జగన్ అన్నా’ అంటూ ప్రారంభించిన లేఖతో షర్మిల జగన్‌ను అక్షరాలా కడిగి పారేశారు. నైతికంగా దిగజారిపోయిన అథఃపాతాళపు లోతుల నుంచి పైకి వచ్చి, ఇప్పటికైనా తండ్రికి ఇచ్చిన మాటను జగన్ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. అలా జరగాలని ప్రార్థిస్తున్నానన్నారు. కానీ ఆయన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తన హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా ఉన్న మార్గాలను ఎంచుకుంటానని షర్మిల స్పష్టం చేశారు.
తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయన జీవితకాలంలో కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందాలని విస్పష్టంగా ఆదేశించారని షర్మిల లేఖలో గుర్తుచేశారు. తండ్రి ఆదేశాల్ని శిరసావహిస్తానని అప్పట్లో జగన్ అంగీకరించారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని తండ్రికి, తనకు హామీ ఇచ్చి వైఎస్ మరణానంతరం మాట తప్పి హామీని తుంగలో తొక్కారని షర్మిల మండిపడ్డారు.
నెరవేర్చే విధంగానే ఉన్నాయి : భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతో పాటు తన జీవితకాలంలో సంపాదించిన అన్ని ఆస్తులూ తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందాలని తండ్రి నిర్ద్వంద్వంగా ఆదేశాలు ఇచ్చారని షర్మిల తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య జరిగిన అన్ని చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు తల్లి విజయమ్మే సాక్ష్యమని వివరించారు. జగన్ ఎంతో ప్రేమానురాగాలతో చేసిన అవగాహన ఒప్పందంలో ప్రస్తావించిన ఆస్తుల వివరాలు తండ్రి ఇచ్చిన ఆదేశాల్ని పాక్షికంగా నెరవేర్చే విధంగానే ఉన్నాయని షర్మిల వ్యాఖ్యానించారు.
భారతి సిమెంట్స్, సాక్షిల్లో మెజార్టీ వాటాలు జగన్ వద్దనే ఉన్నందున పాక్షికం అన్న మాటను ఒత్తి చెబుతున్నానని షర్మిల పేర్కొన్నారు. బలవంతుడిగా, తనదే పైచేయిగా, జగన్ అనుకున్నది తప్ప ఎవరి మాటనూ లెక్క చేయని పరిస్థితి ఉన్నందున ఎంఓయూలో ప్రస్తావించిన అరకొర ఆస్తుల్ని తీసుకుని వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అంగీకరించానని చెప్పారు. తోడబుట్టిన అన్నయ్యతో వివాదాన్ని కొనసాగించడం, కుటుంబాన్ని రచ్చకెక్కించడం ఇష్టంలేక ఆస్తిలో సమాన వాటా పొందేందుకు తనకున్న హక్కుని వదులుకునేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. 2019 ఆగస్టు 31న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం తనకు అరకొర ఆస్తులు మాత్రమే సంక్రమించాయని షర్మిల వివరించారు.
YS Sharmila on Faimly Property Disputes : ఒప్పందం అమలు చేసేందుకు జగన్‌కు మనసు రావడం లేదని షర్మిల విమర్శించారు. ప్రస్తావించిన అరకొర ఆస్తుల్ని తనకివ్వడం జగన్‌కు ఇష్టం లేదని మండిపడ్డారు. ఎంఓయూ ప్రకారం సొంత చెల్లెలు, ఆమె పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. దాని కోసం ఏకంగా సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారిపోయారని చెప్పారు. తండ్రి నడిచిన మార్గానికి జగన్ ఎంత దూరంగా వెళుతున్నారో చూసి దిగ్భ్రాంతి చెందుతున్నానని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.