Sharmila Complaint on Jagan over Adani Bribe issue:అదానీ నుంచి రూ. 1,750 కోట్లు లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. 25 ఏళ్లపాటు యూనిట్ 2.49 రూపాయల చొప్పున సరఫరా చేసేలా చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ విషయం 2021లోనే టీడీపీకి తెలుసునని దీనిపై అప్పట్లోనే హైకోర్టులో పయ్యావుల కేశవ్ పిటిషన్ వేశారని గుర్తు చేశారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏంచేస్తున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందని షర్మిల అన్నారు. అప్పట్లో జగన్‌కి లంచం ఇచ్చినట్టు అమెరికాలో ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని ఆమె తెలిపారు.
2021లో అదానీ జగన్‌కి మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని స్పష్టమైందన్నారు. అన్ని ఆధారాలతో చార్జీ షీట్ ఫైల్ చేసి ట్రెయిల్ కూడా అమెరికాలో మొదలు పెడుతున్నారని వెల్లడించారు. మన దేశం, రాష్ట్రాలలో అవినీతి బయట పెట్టే సంస్థలు లేవా అని ప్రశ్నించారు. ఇప్పుడు నష్టపోయేది అదానీ, జగన్ కాదని రాష్ట్ర ప్రజలని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలలో 1.99 పైసలకే దొరుకుతుంటే జగన్ 2.49 కి కొన్నారని మండిపడ్డారు.