Municipal Chairmen and Vice Chairmen Elections: సోమవారం (03/04/2025) వాయిదా పడిన తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తయింది. ఆ రెండు పదవుల్ని కూటమి కైవసం చేసుకుంది. పాలకొండ ఛైర్ పర్సన్ ఎన్నిక కోరం లేక నిలిపివేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తుని వైస్ ఛైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 35వ వార్డు కార్పొరేటర్ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. సోమవారమే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది. మంగళవారం ఎస్వీ యూనివర్సిటీలో ఈ ఎన్నిక నిర్వహించారు. టీడీపీకి చెందిన మునికృష్ణకు 26 మంది మద్దతు తెలిపారు. దీంతో అధికారులు మునికృష్ణ ఎన్నికైనట్లు ప్రకటించారు.
నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్యే మార్గంగా అధిష్ఠానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది. సోమవారమే ఎన్నిక జరగాల్సి ఉండగా తాను సూచించిన అభ్యర్థి కాకుండా మరో పేరును పార్టీ సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు. తాను సూచించిన అభ్యర్థినే ఛైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుపట్టారు. ఈ క్రమంలో మంగళవారం పార్టీ అధిష్ఠానం మధ్యే మార్గంగా ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా 10వ వార్డు సభ్యురాలు మండవ కృష్ణకుమారి పేరు ఖరారు చేసి ఏకాభిప్రాయం కుదిర్చింది. కౌన్సిలర్లతో సమావేశ మందిరానికి హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్డారు. మండవ కృష్ణ కుమారిని లాంఛనంగా ఎన్నుకున్నారు.
'ప్రభుత్వ పథకాలపై నిరంతరం అభిప్రాయ సేకరణ జరపాలి'
రెండోసారీ వాయిదా పడిన ఎన్నికలు: కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ పదవి ఎన్నిక రెండోసారీ వాయిదా పడింది. కౌన్సిలర్లను భయపెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరం బయట బైఠాయించారు. దీంతో శాంతిభద్రతల సమస్యకు ఆస్కారం ఉందని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఛైర్ పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. అధ్యక్ష పీఠానికి అర్హురాలైన ఆకుల మల్లేశ్వరి ఇటీవలే టీడీపీలో చేరారు. సోమవారం ఛైర్ పర్సన్ ఎన్నిక సమయంలో మల్లేశ్వరి తమ అభ్యర్థి అంటూ వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుపడ్డారు. మల్లేశ్వరి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు. ఒక పార్టీ తరఫున బీఫాం ఇచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వీలు కుదరదని ఎన్నికల అధికారి చెప్పడంతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మంగళవారం ఎన్నిక నిర్వహించారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు హాజరు కాలేదు. కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఒకరు మరణించారు. 32 మంది కౌన్సిలర్లలో ఐదుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. తగినంత మంది సభ్యులు లేక వైస్ ఛైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని ఆర్డీవో చెప్పారు.
దిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉంది: సీఎం చంద్రబాబు
వెనకబడిన జిల్లాల రైతులను ప్రోత్సహించేలా బడ్జెట్: పవన్ కల్యాణ్