TDP wins Tirupati Municipal Corporation Elections: తిరుపతి నగకపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ వశమైంది. ఆ పార్టీ కార్పొరేటర్ ఆర్‌సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికలో 26 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. సోమవారమే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది.
తిరుపతి నగరపాలక సంస్థలో మొత్తం 50 మంది కార్పొరేటర్లకుగాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. మొత్తంగా 50 మంది సభ్యులకుగాను సగం మంది హాజరు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని సోమవారం ఎన్నిక వాయిదా వేశారు.
కరుణాకర్‌రెడ్డి రాజకీయం ముగిసింది: ఈ ఉదయం ఎంపీ గురుమూర్తితో పాటు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ఎన్నిక జరిగిన ఎస్వీ యూనివర్సిటీ సమావేశ మందిరానికి వచ్చారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణకు 26 మంది మద్దతు ప్రకటించారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు లేవని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికతో తిరుపతిలో వైఎస్సార్సీపీ నేత కరుణాకర్‌రెడ్డి రాజకీయం ముగిసిందని ఆయనకు రాజకీయ సన్యాసం తప్పదని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు.
అర్ధరాత్రి హైడ్రామా : తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి దాడికి యత్నించారు. రాయల్ నగర్‌లోని దేవనారాయణరెడ్డి ఇంటి వద్దకు తన అనుచరులతో చేరుకున్న ఆయన బీభత్సం సృష్టించారు. ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది అనుచరులతో కర్రలు, పైపులతో దాడికి యత్నించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అభినయరెడ్డిని అడ్డుకుని నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి భార్య దేవనారాయణరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు అభినయరెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకువచ్చి నిర్బంధించినా టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కరుణాకర్ రెడ్డి భార్యకు నచ్చజెప్పి పంపారు. వైఎస్సార్సీపీ నేతలకు మద్దతుగా ఎంపీ గురుమూర్తి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.