ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైఎస్సార్​ పాలనతో జగన్​కు పోలికే లేదు- బీజేపీకి బానిసలా మారిన వైసీపీ : షర్మిల - Sharmila

YS Sharmila Allegations on CM Jagan: వైఎస్ఆర్​ పాలనకు, జగన్ పాలనకు చాలా తేడా ఉందని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కడప​లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి హాజరైన షర్మిల సీఎం జగన్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ys_sharmila_jagan
ys_sharmila_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 5:13 PM IST

YS Sharmila Allegations on CM Jagan:వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారని మరి వైఎస్ మార్క్ జగనన్న పాలనలో ఎక్కడ ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కడప జయ గార్డెన్స్​లో ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి షర్మిల హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలంతో పాటు రఘు వీరారెడ్డి, తులసి రెడ్డి, గిడుగు రుద్రరాజు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రి పాలనకు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు.

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

వైసీపీని అధికారంలోకి తేవడానికి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని జగన్ కోసం అంత గొప్ప త్యాగం చేస్తే తన పైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకొక జోకర్ గాడు బయటికి వచ్చి తనపై వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారన్న ఆమె.. రోజుకో కట్టుకథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. జగన్​ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని అదంతా శుద్ధ అబద్ధం అన్నారు. సోనియా గాంధీ వద్దకు అనిల్, భారతి రెడ్డితో కలిసే వెళ్లారని గుర్తు చేశారు.

వైఎస్సార్​సీపీలో YSR అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణా రెడ్డి : షర్మిల వ్యంగ్యాస్త్రాలు

వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది పదవీకాంక్ష ఉంటే నాన్న సీఎంగా ఉన్నప్పుడు తీసుకునే వాళ్లం కదా అని ప్రశ్రించారు. జగన్ కోసం పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను పదవి అడగలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ వారికి దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండని సవాల్ విసిరారు. సాక్షి పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు కాని ఆ పత్రికలో జగన్​కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకు అంతే భాగం ఉందని షర్మిల స్పష్టం చేశారు. ఆ విషయం మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఏం రాసినా ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్న షర్మిల ఏం చేసుకుంటారో చేసుకోండి భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా బదులిచ్చారు.

వైఎస్ షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ - కాంగ్రెస్‌లో చేరనున్నారా?

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ఒక కలలా మిగిలిపోయింది వైఎస్‌ఆర్‌ బతికుంటే కడపకు స్టీల్‌ ఫ్యాక్టరీ వచ్చేది అంతే కాకుండా కడప జిల్లాకు ఆయన ఇంకా ఎంతో చేసేవారని అన్నారు. జగన్ కడప జిల్లా వాసిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయాడని. కడప -బెంగుళూరు రైల్వే నిర్మాణం ఆగిపోయేలా చేసాడని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను ఇప్పటివరకూ ఆదుకోలేదని అన్నారు. ఇంక జగనన్నకు కడప జిల్లాపై ప్రేమ ఉందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ బానిసై అన్ని విషయాల్లో మద్దతిస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details