Deepthi Jeevanji Get Medals in World Para Athletic Championship : పేదరికం మానసిక వైకల్యం. ఆపై వెక్కిరింతలు. అవమానాలు, వీటన్నింటినీ భరించినా, తల్లిదండ్రుల బాధ ఆ అమ్మాయిని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అంతమాత్రనా అక్కడే ఉండి పోలేదు. ఆత్మవిశ్వాసంతో పరుగందుకుంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డులు, స్వర్ణాలతో పాటు అర్జున అవార్డుతో దేశం గర్వించేలా చేసింది. ఎంతోమంది క్రీడకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ యువ క్రీడాకారిణిపై ప్రత్యేక కథనం.
పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకంతో సత్తాచాటింది ఈ తెలుగుమ్మాయి. పారిస్ క్రీడల్లో పతకాలు సాధించి తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచింది. అర్జున అవార్డుతో మరోసారి దేశం గర్వించేలా అందరి మన్నలు పొందుతుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నింటిని దాటుకొని విజయం వైపు అడుగులు వేసింది. ఈ క్రీడా కుసుమం పేరు జీవాంజి దీప్తి. తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన యాదగిరి, ధనలక్ష్మీ దంపతుల పెద్ద కుమార్తె. పేదరికం, గ్రామీణ నేపథ్యం, తన రూపం మానసిక స్థితిపై వెక్కిరింతలు ఇవేవి ఆమెలో దాగిన ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. అన్నింటిని జయించి దేశానికి వెన్నె తెచ్చేలా అథ్లెటిక్స్‌లో రాణించింది.
పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో పతకం సాధించింది. ప్రపంచ వేదికపై ఛాంపియన్‌గా నిలిచి భారత కీర్తి పతకాన్ని ఎగురవేసింది దీప్తి. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపించద్ సహకారం, కోచ్ రమేష్ మార్గనిర్దేశం, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం అండతో మేటి రన్నర్‌గా ఎదిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆటలపై ఎక్కువ దృష్టి పెట్టానని చెబుతోంది దీప్తి. ఇటీవల కేంద్రం ప్రకటించిన అర్జున అవార్డుల జాబితాలో ఆమె స్థానం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించి అందరి ప్రశంసలు అందుకుంటుంది.
విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ - క్రికెట్‌తో పరిచయం నుంచి వరల్డ్ కప్ వరకూ ప్రయాణం
'పారిస్ క్రీడల్లో పతకం సాధించిన ఏకైక తెలుగమ్మాయిగా దీప్తి ఘనత సాధించింది. ఇప్పుడు తనను అవమానించిన వాళ్లు హేళన చేసిన వారే జేజేలు పలుకుతున్నారు. చాలామంది సెల్యూట్ చేస్తున్నారు. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలకు దీప్తి స్ఫూర్తిగా నిలిచింది. క్రీడలతో ఏదైనా సాధ్యమే అనడానికి ఇదే నిదర్శనం. కేంద్రం దీప్తికి అర్జున ఆవార్డు ప్రకటించాక AP-SRM యూనివర్సిటీ బృందం ఘనంగా సత్కరించింది. 40 లక్షల రూపాయల ప్రోత్సాహం అందజేసింది. విద్యాలయం తరపున రాబోయే పోటీల్లో ఆమెకు పూర్తిగా సహకరిస్తామని యాజమాన్యం ప్రకటించింది.' - శ్రీపతి, స్పోర్ట్స్ ఆఫీసర్, ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ
కష్టాలెన్ని ఉన్నా ఆటంకాలు ఎన్ని ఎదురైనా నీ లక్ష్యాన్ని చేరుకునే వరకూ ఆగి పోవద్దు. అప్పుడే విజయతీరాలకు చేరటం సాధ్యమనే మాటలు దీప్తి విషయంలో అక్షరాలా నిజమయ్యాయి.