Jagan Fake Publicity : పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన షేక్ రషీద్(25) కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు కేటాయించిన వాహనం సౌకర్యంగా లేదని మార్గంమధ్యలో వేరే కారులోకి మారి వెళ్లారు. అంతేకాకుండా ఫిట్‌గా లేని వాహనం జగన్‌కు ఇచ్చారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వాహనం పూర్తి ఫిట్ నెస్‌తో ఉందని కండిషన్ చూసిన తరువాతనే వీఐపికి కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జగన్ వ్యవహారశైలిని టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు.
శవ రాజకీయానికి వినుకొండ బయలుదేరిన జగన్ 5 నిమిషాలు కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చో లేకపోయాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే కారులో చంద్రబాబు దాదాపు 10 ఏళ్లు ప్రయాణం చేశారని, ప్రతిపక్ష నేతగా, NSG భద్రతలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని గుర్తు చేస్తున్నారు. జగన్ చేసిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని చాటేందుకు ఏకధాటిగా వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని, కానీ ఎక్కడా తనకు కంఫర్ట్‌గా లేదని, నా వాహనాలు మార్చండి అని చంద్రబాబు ఏనాడూ యాగీ చెయ్యలేదని అంటున్నారు. ప్రభుత్వం కక్ష కట్టిందని రాజకీయం చేయలేదని తెలిపారు.
హత్యా రాజకీయాలకు పేటెంట్ వైఎస్సార్సీపీదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఒంగోలు మహానాడుకు వెళుతుంటే ప్రభుత్వ కారులో ఏసీ రాకపోతే చంద్రబాబు ఎమ్మెల్యే కారులో ప్రయాణం చేశారని స్పష్టం చేశారు. ఆనాడు బుల్లెట్ ఫ్రూప్ లేని వాహనంలో వెళ్లాల్సి వచ్చినా లెక్క చేయలేదని, గొడవ చేయలేదంటున్నారు. అప్పటికే మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఆ వయసులో అదే వాహనంలో ప్రయాణం చేశారంటున్నారు. ప్రజల పక్షాన పోరాడారని, ఇంతెందుకు నంద్యాలలో అరెస్టు చేసి రోడ్డు మార్గంలో తీసుకువచ్చింది కూడా అదే తరహా సఫారీ కారులోనే అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ జగన్ మాజీ అయిన నెల రోజులకే ప్రభుత్వ కారు నచ్చలేదు, సౌకర్యవంతంగా లేదు అని దిగిపోయాడని ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే జగన్ దిగిన కారులో ఏ సమస్యా లేదని, ఆయన దిగిన తరువాత కూడా ఆ కారు కాన్వాయ్‌ను ఫాలో అయ్యిందని అంటున్నారు.