Young Voters Set To Play Vital Role In Elections :ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపోటములు నిర్ణయించడంలో మహిళలు, యువత కీలక భూమిక పోషించనున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 803,000 మంది ఉంటే మహిళా ఓటర్లు 8లక్షల 50వేల వరకు ఉన్నారు.
అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసేది వీరే :నాగర్‌కర్నూల్ లో పురుష ఓటర్లు 8లక్షల 60వేల మంది ఉంటే మహిళా ఓటర్లు 8లక్షల 70వేల వరకూ ఉన్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల పరిధిలో మొత్తం 34లక్షల 20వేల మంది ఓటర్లుంటే వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు లక్షకు పైగా ఉన్నారు. మొత్తం యువ ఓటర్ల సంఖ్య సైతం 18లక్షలు దాటుతోంది. అంటే మహిళలు, యువ ఓటర్లే దాదాపుగా అభ్యర్ధుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు.
కానీ పట్టణ ప్రాంత ఓటర్లు, చదువుకున్న యువత, వలస ఓటర్లు స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన శ్రద్ధ లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి ఉండటం లేదు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సగటున 80 నుంచి 90శాతం వరకూ నమోదవుతున్న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి 70 నుంచి 80శాతం మధ్య ఉంటోంది. అదే లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి 60 నుంచి 75శాతం మధ్యే నమోదవుతోంది. పోలింగ్ శాతం పెంచాలంటే యువతీ యువకులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలోఓటుహక్కు వినియోగించుకుంటే మెజారిటీ ఓటర్లకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే వీలు కలుగుతోంది.
Lack OF Awareness on Voting :ఓటు హక్కు వినియోగంపై సరైన అవగాహన లేక, ఓటు విలువ తెలియక కొందరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. చదువుకున్న యువత సైతం అలాంటి వాళ్లలో ఉన్నారు. అందరూ ఓటేసి తానొక్కడిని వేయకపోతే జరిగే నష్టమేంటనే భావన కొందరిని ఓటింగ్‌కు దూరంగా ఉంచుతోంది. చదువని, ఉద్యోగమని, తీరక లేదని ఇలా చాలా కారణాలతో ఓటు వినియోగానికి దూరంగా ఉండే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లంతా లోక్‌సభ ఎన్నికల్లో తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది పాలమూరు యువత. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటనే ఆయుధంతో ఈ సమాజాన్ని, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఒక్క యువతే ఉందనేది వారి వాదన.