YCP Leader Family Anarchy in Srikakulam District:శ్రీకాకుళం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబం భూకబ్జాలు, సెటిల్మెంట్లతో చెలరేగుతోంది. రాకరాక వచ్చిన అధికారంతో ఆ ప్రజాప్రతినిధి దోపిడీలకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ఖర్చుల కోసం అమ్మిన నాలుగెకరాలు తిరిగి లాక్కోవడం ద్వారా ఆయన అరాచకపర్వం ఆరంభించారు. భూమి కొనుగోలుదారుల్ని పిలిపించి తన భూమి తనకు వెనక్కి ఇస్తారా? కేసులు పెట్టించమంటారా? అని భయపెట్టారు. ఎందుకొచ్చినగొడవంటూ కొనుగోలుదారులు నామమాత్రపు డబ్బు తీసుకుని ఆ భూమి పత్రాలు ప్రజాప్రతినిధికి తిరిగి ఇచ్చి వెళ్లిపోయారు.
నియోజకవర్గ కేంద్రంలోని ప్రఖ్యాత మఠం భూములపైనా ఆయన కన్నుపడింది. 300 ఎకరాల మఠం భూముల్లో కొంత భాగం పలువురు స్థిరాస్తి వ్యాపారులు ఇతర వ్యక్తుల చేతుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధి సంబంధిత వ్యక్తుల్ని పిలిపించారు. తనకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆయనతో వేగలేక కొందరు దండం పెట్టేశారు. 3ఎకరాలను 10కోట్ల రూపాయలకే ముట్టజెప్పారు. అక్కడ ఎకరా 10 కోట్ల రూపాయలపైనే పలుకుతుండడంతో తమ వాటా ఇవ్వటానికి కొందరు నిరాకరించారు. నేను అడిగిందే కాదంటారా అని స్థలం ఇవ్వని వారి అపార్ట్‌మెంట్లకు కరెంటు కట్ చేయించి తన ప్రతాపం చూపించారు. తన చేతికి మట్టి అంటకుండా చేసే అరాచకాలకూ అంతేలేదు.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!
దేవత సొమ్మునూ వదల్లేదు:పీఏసీఎస్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్న తన బినామీతో ఓ చెరువు గర్భంలో 5 ఎకరాలు ఆక్రమించారు. దాన్ని స్థిరాస్తి లే అవుట్లుగా మార్చేసి విక్రయించేశారు. ఈ వ్యవహారంలో సదరు ప్రజాప్రతినిధికి కోటి రూపాయల వరకూ గిట్టుబాటైంది. దేవత సొమ్మునూ ఆయన వదల్లేదు. గ్రామదేవతకు సంబంధించిన బంగారం, వెండి నగలు, డబ్బుల్ని భద్రపరిచిన లాకర్ తాళాలు ఇవ్వాలంటూ పాలక మండలి సభ్యులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు సభ్యులు తాళాలు ఇచ్చేయగా ఒకరు మాత్రం బెదిరించినా లొంగలేదు. ఆగ్రహించిన ప్రజాప్రతినిధి ఆఘమేఘాలపై పాత కార్యవర్గాన్ని రద్దు చేయించి కొత్తది ఏర్పాటు చేయించారు. కొత్త సభ్యులంతా తమవద్దనున్న మూడు తాళాలు తక్షణమే ప్రజాప్రతినిధికి అప్పగించాలని తీర్మానం చేశారు.
అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు:ఉద్యోగులు పని చేసుకోవాలంటే ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్లు నడుచుకోవాల్సిందే లేదంటే సెలవుపై వెళ్లిపోవాల్సిందే. సదరు ప్రజాప్రతినిధి నియోజకవర్గ కేంద్రంలో తన బినామీతో ప్రభుత్వ హెల్త్ సెంటర్ భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. ఐతే ఆ స్థలంలో అంతకు ముందు ఎస్సీ సంక్షేమ వసతిగృహం ఉండేది. అనుమతులు లేకుండానే దాన్ని తొలగించి, హెల్త్‌సెంటర్ కట్టడంతో బిల్లులు మంజూరు కాలేదు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్‌లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అది తమ పరిధి కాదని ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా వేధించారు. ఆయనతో వేగలేక కొన్నాళ్ల క్రితం మున్సిపల్ కమిషనర్ 4 నెలలపాటు మెడికల్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు.
నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ దేవస్థానానికి భూములు జాతీయ రహదారికి పక్కనే భూములున్నాయి. వాటిపై కన్నేసిన ప్రజాప్రతినిధి ఆ భూముల్ని తన పరం చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నా వల్లకాదంటూ స్థానిక తహసీల్దార్ అప్పట్లో సెలవుపై వెళ్లిపోయారు. నాగావళి, వంశధార నదుల అనుసంధాన పనుల్లో భాగంగా నియోజకవర్గంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో కాలువ తవ్వాల్సి ఉంది! ఐతే అక్కడ దేవాదాయ శాఖ, స్థానిక రైతుల మధ్య యాజమాన్య వివాదం తలెత్తింది. సదరు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని రైతులకు పరిహారమిప్పించారు. సందట్లో సడేమియా అన్నట్లు తన బినామీల పేర్లు జాబితాలో చొప్పించి ఆ పరిహారంలో రూ.80 లక్షల వరకూ వెనకేసుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో సదరు ప్రజాప్రతినిధికి ఒక ప్రైవేటు కళాశాల ఉంది. ఐతే పోటీగా ఉన్న 4ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను మూసేయించారు.