Vijayawada Lok Sabha Constituency Political Review:రాష్ట్రంలో విజయవాడ అత్యంత ప్రముఖమైన లోక్‌సభ నియోజకవర్గం. రాజకీయ చైతన్యానికి మారు పేరు. ఎందరో ఉద్ధండులు ఈస్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2014 నుంచి ఇక్కడ తెలుగుదేశానిదే హవా. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా 2019లోనూ ఇక్కడి ప్రజలు సైకిల్‌కే జైకొట్టారు. ఈసారి ఇక్కడ అన్నదమ్ముల సవాల్ నడుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన కేశినేని నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇన్నాళ్లూ అన్న వెనకాల ఉన్న కేశినేని శివనాథ్ తెలుగుదేశం నుంచి బరిలో నిలిచారు. పార్టీ విజయాన్ని తన సొంత విజయంగా భావించడం కేశినేని నాని అతిపెద్ద మైనస్. అదే అహంకారంతో ఇష్టారీతన నోరు పారేసుకుంటున్నారు. మరోవైపు శివనాథ్ మాత్రం సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. సామాజిక సమీకరణాలు కీలకమైన ఇక్కడ కూటమిలో జనసేన ఉండటం శివనాథ్‌కి కలిసొస్తోంది. మొత్తంగా అన్నను ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టడమే తరువాయి అన్నట్లు శివనాథ్ దూసుకెళ్తున్నారు.
ఆసక్తికరంగా సమీకరణాలు: రాజకీయంగా హేమాహేమీలు విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో ఎదురుగాలిలోనూ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో సైకిల్ పరుగులు పెట్టింది. అయితే ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడ లోక్‌సభకు ఈసారి ప్రధాన ప్రత్యర్థులుగా కేశినేని బ్రదర్స్ పోటీ పడుతున్నారు. 2014, 2019ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించిన కేశినేని నాని ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. నిన్నటివరకు రాజధాని నిర్మాణంలో జగన్‌ను తప్పుపట్టిన ఆయన నేడు మూడు రాజధానులకు జై కొడుతున్నారు. స్థానిక అభివృద్ది ముఖ్యమనే ఆయన రాజధానిని స్థిరాస్తి వెంచర్‌గా అభివర్ణించి ప్రజల్లో పలుచనయ్యారు.
రాజధాని అంశాన్ని ప్రస్తావించేందుకే వైసీపీ అభ్యర్థులు భయపడుతుంటే కేశినేని నాని మాత్రం ఏకంగా చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టడం ఎన్టీఆర్ జిల్లా ప్రజలకే కాదు వైసీపీ నేతలకూ నచ్చడం లేదు. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు తన వ్యక్తిగత ప్రతిష్టే కారణమనే భ్రమలో ఉన్న నాని ఇప్పటికీ అదే పంథా కొనసాగించడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమతో ప్రచారానికి పెద్దగా ఆహ్వానించడం లేదు. ఈసారి తెలుగుదేశం నుంచి ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ చిన్ని పోటీలో నిలిచారు. 2014, 2019లో సోదరుని వెంట ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించిన కేశినేని చిన్నికే తెలుగుదేశం టిక్కెట్ దక్కింది.
రెండు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలతో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజలకు చిన్ని దగ్గరయ్యారు. ప్రధానంగా అన్న క్యాంటీన్లు నిర్వహించి పేదలకు పట్టెడన్నం పెట్టారు. వైద్యశిబిరాలు, జాబ్‌మేళాలు విరివిగా నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలను కలుపుకుని ముందుకెళ్తున్నారు. విజయవాడ లోక్‌సభ నుంచి మూడోసారి సైకిల్ పార్లమెంటుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలు, అవినీతి దందాతో విసిగిపోయిన ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఎన్టీయేను ఆశీర్వదించేందుకు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు.
Vijayawada East Constituency:విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తూర్పు నియోజకవర్గం కీలక స్థానం. ఈసారి హ్యాట్రిక్ విజయానికి ఇక్కడ తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. గత రెండు ఎన్నికల్లో గెలుపొంది మూడోసారి పోటీ చేస్తున్న ఆపార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి జనసేన తోడవడంతో విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. 2019లో అవినాష్ తెలుగుదేశంలో ఉండి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు. తర్వాత తూర్పు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా అతడిని నియమించారు. తూర్పులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నా అనధికారికంగా దేవినేని అవినాష్ వ్యవహరించారు.
నగరపాలక సంస్థ నిధులను కొల్లగొట్టడమే కాకుండా అనేక ఘటనల్లో అవినాష్ అనుచరుల హస్తముందన్న ఆరోపణలు వినిపించాయి. వైసీపీ అధికారం అండ చూసుకుని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌పై దాడి చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై తన అనుచరులతో దాడి చేయించారు. మరోవైపు మారిన రాజకీయ సమీకరణాలు అవినాష్‌ను ఇబ్బంది పెట్టాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన బొప్పన భవకుమార్ తెలుగుదేశంలో చేరారు. పలువురు సీనియర్ నాయకులు వైసీపీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేనకు తూర్పులో దాదాపు 32వేల ఓట్లు వచ్చాయి. ఇవి గద్దెకు అదనపు బలం కానున్నాయి. కేవలం సంక్షేమ పథకాలతోపాటు ఒక్కఛాన్సు ఇవ్వండి అంటూ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడం కీలకమైన ప్రభావం చూపనుంది.
Vijayawada Central Constituency:గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం త్రుటిలో ఓటమి పాలైంది. కేవలం 25 ఓట్ల తేడాతో వైసీపీ గెలుపొందింది. 2019లో ఇక్కడ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది పనితీరు బాగాలేదనే సాకుతో పక్క నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించింది. స్థానిక నేతలు, టిక్కెట్ రాని తాజా ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహాయ నిరాకరణతో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎదురీదుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు ప్రారంభించారు. వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు కుక్కర్లు ఇచ్చారు.
ఇవన్నీ పారకపోవడంతోనే సీఎం బస్సుయాత్ర పెట్టి గులకరాయి నాటకానికి తెర తీశారని స్థానిక ప్రజలు అంటున్నారు. పైగా కేసులో వడ్డెరకాలనీ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేశారు. వ్యాపార వర్గాలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా ఉన్న మధ్య నియోజకవర్గంలో ప్రభుత్వం పన్నుల బాదుడుకు ప్రజలు లబోదిబోమంటున్నారు. అమరావతి నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయనే అవేదనలో ఉన్నారు. బొండా ఉమ సైతం ప్రచారంలో ముందున్నారు. ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి రావడం పక్కాగా కనిపిస్తోంది.
రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకత - కూటమిదే హవా - Rajamahendravaram Constituency
Vijayawada West Constituency:విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలోకి దిగడం ప్రత్యేకతను సంతరించుకుంది. కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన సుజనా తనదైన ప్రచార సరళితో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమలో వ్యాపార వర్గాలు, మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి. 2019లో గెలుపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మధ్య నియోజకవర్గానికి మారారు. ఆయన హయాంలో పశ్చిమలో జరిగిన తప్పిదాలు పార్టీకి ప్రతికూలంగా మారాయని సీఎం జగన్ భావించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారు సాక్షిగా అవినీతి అక్రమాలు అంతులేకుండా పోయాయి.