Deputy CM Bhatti Explained on CMs Meeting Points : రెండురాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశంలో నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని భట్టి విక్రమార్క వివరించారు.
ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసిన తర్వాత భేటీ వివరాలను భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో మాట్లాడుకున్నామని ఇరురాష్ట్ర మంత్రులు తెలిపారు. రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామన్న అమాత్యులు, ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ముగ్గురు ఉన్నతాధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు :హైదరాబాద్‌లో ప్రజాభవన్ వేదికగా సుమారు రెండుగంటల పాటు జరిగిన భేటీలో ప్రధానంగా షెడ్యూల్-9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీపై చర్చించినట్లు భట్టి విక్రమార్క వివరించారు. కమిటీల ద్వారానే విభజన సమస్యలకు పరిష్కరిస్తామన్న ఆయన, ఆ దిశగా సీఎస్‌లు, ముగ్గురు అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీని వేయాలని తీర్మానించామని పేర్కొన్నారు.
"ముఖ్యమంత్రులు సహా ప్రతినిధుల బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తరవాత ఒక నిర్ణయానికి రావటం జరిగింది. విభజన సమస్యల పరిష్కార మార్గాలను చూడటానికి ముందుగా ఇరురాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కమిటీ వేసి, రెండు వారాల్లో సమావేశమై సాధ్యమైనంతవరకు వాళ్ల స్థాయిలో పరిష్కారం వచ్చే అంశాలను చర్చిస్తాం."-భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం