TDP Victory in AP Elections 2024 :అది 2019 సంవత్సరం మే 23, సరిగ్గా 5ఏళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటే క్రమేణా పసుపు శిబిరం ఖాళీ అవుతూ వచ్చింది. 4 దశాబ్దాల ఘనకీర్తి కలిగిన తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కాదని, ప్రజలు జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ వైపు మొగ్గుచూపటంతో పసుపు శ్రేణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. కేవలం 23 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పార్టీ ఆవిర్భవించాక ఎన్నో గెలుపోటమలు చూసిన పార్టీ ఇంతటి ఘోరమైన ఫలితాలను మునుపెన్నడూ ఎరుగదనే చెప్పాలి.
అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ చుట్టూ ఉన్న నాయకులు, నేతలూ క్రమేణా తగ్గుముఖం పట్టారు. అధినేత చంద్రబాబు వయోభారాన్ని ఎత్తి చూపుతూ ఇక పార్టీ పనైపోయిందని ఫలితాల రోజు పసుపు శిబిరంలోనే కొందరు గుసగుసలాడారు. 23వ తేదీ ఫలితం తెలుగుదేశం పార్టీని 23కే పరిమితం చేసిందంటూ వైఎస్సార్సీపీ దెబ్బిపొడిచింది. 5 ఏళ్లు కాలం గిర్రున తిరిగింది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి అన్నట్లుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. 5 ఏళ్లు సర్వశక్తులు ఒడ్డి ప్రజల పక్షాన పోరాడారు. మొత్తంగా ఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా ప్రజలు భావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరిగి ఘన విజయాన్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు.
విజయాహంకారంతో విధ్వంస పాలన అందించిన వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టారు. పాలనా అనుభవం, రాజకీయ చతురత ఉన్న చంద్రబాబుకు జై కొడుతూ తిరిగి అధికార పగ్గాలు అందించారు. అయితే, ఈ విజయం ఆషామాషీగా వచ్చింది కాదు. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు 'క్లెమోర్ మైన్స్ పేలి 30అడుగులు ఎత్తుకి కారు ఎగిరి కింద పడినా, చొక్కా దులుపుకుని రాజకీయ సేవ చేద్దాం పదండి' అన్నట్లే చంద్రబాబు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా వ్యవహరించారు. క్యాడర్ చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ అతి త్వరలోనే పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపి మళ్లీ పుంజుకునేలా చేశారు.
2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన శక్తులన్నీ ఈ ఎన్నికల్లో జగన్‌కి వ్యతిరేకంగా పనిచేసేలా రాజకీయ చతురత ప్రదర్శించారు. అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీ ముఖ్య నాయకులు అనేక మందిని జైల్లో పెట్టింది. పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలపైనా పెట్టిన అక్రమ కేసులు, అరాచకాలకు లెక్కేలేదు. వాటన్నిటినీ ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు. యువగళం పేరుతో లోకేశ్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర, పార్టీని యువతరానికి ప్రజలకూ మరింత చేరువ చేసేందుకు దోహదం చేసింది. రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమైన టీడీపీతో జనసేన, బీజేపీ మళ్లీ జట్టుకట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం ఖరారైంది.
2019 సంవత్సరం, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ప్రభుత్వ పనితీరును కొంతకాలం సమీక్షించి ఆ తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షంగా పోరాడతామని ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయంపై చంద్రబాబు స్పందించారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజు ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంగణాన్ని కూలకొడుతున్నట్లు విధ్వంస ప్రకటన చేశారు. ప్రతిపక్షంతో పాటు రాష్ట్ర ప్రజలకీ వైఎస్సార్సీపీ పాలనా విధానంపై ఆ ఒక్క నిర్ణయంతో స్పష్టమైన అవగాహన వచ్చేసింది.
ఇక ఉపేక్షిస్తే రాష్ట్రమంతటా విధ్వంసమే జరుగుతుందనే భావనతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల పక్షాన పోరాడటం ప్రారంభించారు. సంఖ్యాబలం తక్కువున్నా, నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నా, ఏమాత్రం లెక్కచేయకుండా అలుపెరగని పోరాటానికి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయంగా వాడుకుందామనుకున్న ప్రజావేదికను కూలగొట్టడం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఇంకా అందుబాటులోకి రాకపోవటంతో కొంత కాలం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు రాష్ట్ర కార్యాలయంగా వాడుకుని కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్నికల్లో వచ్చిన విజయగర్వంతో తెలుగుదేశం నేతలపై వైఎస్సార్సీపీ హింసాత్మక దాడులకు పాల్పడింది. పల్నాడు ప్రాంతంలో దాడులకు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న కార్యకర్తల కుటుంబాలకు గుంటూరులో ఆశ్రయం ఏర్పాటు చేయించారు. వారికి ధైర్యం చెప్పి తిరిగి వారి స్వస్థలాల్లో దిగపెట్టి కొంతకాలం అక్కడే వారి మధ్యే ఉండేందుకు చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలగాల సాయంతో చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం ఆయన ఇంటి గేట్లకు తాళ్లు కట్టించటం సంచలనమైంది. నవ్యాంధ్ర అసెంబ్లీకి తొలి స్పీకర్‌గా పనిచేసిన సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపైనా వేధింపులకు దిగింది. తన క్యాంపు కార్యాలయంలో ఉన్న అసెంబ్లీ సామగ్రిని స్వాధీనం చేసుకోమని కోడెల రాసిన లేఖను తొక్కిపెట్టిన ప్రభుత్వం, సామగ్రి చోరీ చేశారంటూ మానసికంగా అసత్య ఆరోపణలతో వేధించటంతో పల్నాటి పులిగా బతికిన కోడెల సైతం ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వీడి వైఎస్సార్సీపీ పంచన చేరారు. అటు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిన ఎంపీలు గరికిపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. తెలుగుదేశం ఇక ఖాళీ అనే వాతావరణం పార్టీలో నెలకొంది.
2019 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన 3 రాజధానుల ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిపివేసి ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం నిర్మానుషంగా మార్చింది. భవిష్యత్తు తరాల రాజధానికోసం 33 వేల ఎకరాలు భూ త్యాగం చేసిన అమరావతి రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన అమరావతి పర్యటనలో పోలీసులు దగ్గరుండి వైఎస్సార్సీపీ శ్రేణులతో రాళ్లు వేయించారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై పడిన రాయిని నాటి డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ రాజ్యాంగం నిరసనకారులకు కల్పించిన హక్కు అది అన్నట్లు మాట్లాడారు. అదే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో అధికార పార్టీ హింసను ప్రేరేపించింది.
దాడులు, దౌర్జన్యాలతో పంచాయితీలను ఏకగ్రీవం చేసుకుంటూ పోలీసు సహా ఇతర ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసింది. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేయనీయకుండా దాడులు, హత్యలు, అక్రమ కేసులు వంటి చర్యలకు పూనుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే వాతావరణం లేదని గ్రహించిన తెలుగుదేశం స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించింది. పార్టీ ఆవిర్భించాక తొలిసారి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ఏడాది కరోనా కారణంగా ఏటా మేలో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించే మహానాడును జూమ్ లో నిర్వహించారు. సాంకేంతికతను ఉపయోగించి ఓ భారీ కార్యక్రమాన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ విజయవంతంగా నిర్వహించిన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు వచ్చేలా చంద్రబాబు చేశారు. ఇసుక, మద్యం, ఇతర ప్రజా సమస్యలపై తెలుగుదేశం తన పోరాటం కొనసాగించేలా నాయకత్వం వహించారు.