Dharmapuri Srinivas Political Journey :ధర్మపురి శ్రీనివాస్ ఇది పరిచయం అవసరం లేని పేరు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి.శ్రీనివాస్. దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి వుండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ డీఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్ధం చేసుకోవచ్చు.
రాజకీయ చతురత కలిగిన నేత :సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా వున్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు. వరుసగా 2004 , 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేశారు.
ఇదీ ధర్మపురి శ్రీనివాస్ నేపథ్యం :1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్‌లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1974 నుంచి 1984 వరకు పదేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్‌లు డీఎస్ కుమారులు. అర్గల్ రాజారాం న్యాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన డీఎస్ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ లో పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.
Posts held By DS :1998లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1989 నుంచి 1994 మధ్య గ్రామీణాభివద్ధి శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన డీఎస్ సుమారు దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేశారు. 2004లో టీఆర్ఎస్( ప్రస్తుత బీఆర్ఎస్) కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన డిఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు.