Telangana Congress Lok Sabha Candidates First List 2024 :రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాలా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకపక్షంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో 39 మందితో కూడిన తొలిజాబితా ద్వారా రాష్ట్రంలో వివాదరహిత 4 లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం జాబితా ప్రకటించింది.
వంశీచంద్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఇదే
పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న చల్లా వంశీచంద్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం శేరిఅప్పిరెడ్డిపల్లివాసి. ఎంబీబీఎస్ చదివిన వంశీచంద్ విద్యార్ధి దశ నుంచి ఎన్ఎస్యూఐలో పని చేస్తూ కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఏఐసీసీ కార్యదర్శిగా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న వంశీచంద్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి మహబూబ్‌నగర్ నుంచి బరిలోకి దించింది.
Telangana Congress MP Candidates 2024 :నల్గొండ లోక్‌సభ(LOK Sabha) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం బరిలోకి దించింది. 2014 నుంచి పీసీసీ సభ్యుడుగా, 2021 నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి పొరిక బలరాంనాయక్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది. ములుగు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన ఆయన 2009లో ఎంపీగా గెలుపొంది 2013 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్న సురేష్ షెట్కర్ యువజన కాంగ్రెస్, మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా, జహీరాబాద్ ఎంపీగా పనిచేశారు.
Lok Sabha polls 2024 : రాష్ట్రంలో మరో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూల్ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి ధీమాతో ఉండగా మరింత అధ్యయనం చేశాకే, సీఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.