Telangana Congress Charge Sheet On BJP 2024 : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నయవంచన పేరుతో, పదేళ్లలో బీజేపీ మోసం - వందేళ్ల విధ్వంసం ట్యాగ్‌లైన్‌తో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.
Revanth Reddy Fires on BJP : ఈ సందర్భంగా పదేళ్ల ఎన్డీఏ పాలన వైఫల్యంపై ఛార్జ్‌షీట్ విడుదల చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత బీజేపీ కుట్రలపై ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ మోసగించారని విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కార్, మూడు నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను బానిసలుగా చేసేందుకు యత్నించిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు ఎన్డీఏ ప్రభుత్వం లొంగిపోయిందన్న సీఎం, చేనేత నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీ విధించి దోపిడీ చేశారని మండిపడ్డారు. దేశాన్ని రూ.168 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారన్న ఆయన, గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్లు అప్పులు చేస్తే, పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.113 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు.
అందుకు రెఫరెండమే ఈ ఎన్నికలు : ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను బీజేపీ అమలు చేసిందని సీఎం విమర్శించారు. రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు కోసం కమలం పార్టీకి 400 సీట్లు కావాలన్న సీఎం, ఓటు బలంతో రిజర్వేషన్ల రద్దుకు కంకణం కట్టుకుందన్నారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతిస్తే నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారి తీస్తుందని, రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని కోరారు. రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అనే దానిపై రెఫరెండమే ఈ పార్లమెంట్ ఎన్నికలని స్పష్టం చేశారు.