Telangana BJP President Kishan Reddy Election Campaign :కేంద్రంలో మూడోసారి అధికారంతో పాటు 400 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ నుంచి రెండంకెల స్థానాలు గెలవాలని భావిస్తోంది. రాష్ట్రం నుంచి ఆశిస్తున్న సీట్లు పొందేందుకు సానుకూల వాతావరణం ఉన్నా, దానిని అభ్యర్థుల విజయం కోసం మలచుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) ఈ ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం లేదని, ఆ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో విఫలమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిన కిషన్ రెడ్డి, కేవలం తన పార్లమెంట్ (Lok Sabha Election 2024) పరిధికే పరిమితమయ్యారని, ఎన్నికల ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు ఏమాత్రం వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధ్యక్షుడిపై పార్టీ శ్రేణులు ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్‌కే పరిమితమైన కిషన్ రెడ్డి : అయితే సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఇతర లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి సమయం కుదరడం లేదనేందుకు అవకాశం లేకపోలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్‌రెడ్డి (Kishan Reddy Campaign) అప్పుడు కూడా గ్రేటర్ పరిధి దాటి ప్రచారానికి వెళ్లింది తక్కువేనని పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై అప్పట్లో కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపన్యాసాలు తప్పితే, హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో జాతీయ స్థాయి నేతల సభలకు మినహా కిషన్‌రెడ్డి పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కిషన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత వల్ల సికింద్రాబాద్ పరిధి దాటి ఎక్కడికీ వెళ్లడం లేదనే చర్చ జోరుగా జరుగుతోంది.
గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ