Telangana BJP Lok Sabha Manifesto 2024 :లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాషాయ పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ప్రజలకు ఏం కావాలనే అంశాలపై పార్టీ ఆరా తీస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇప్పటికే ఈ అభిప్రాయ సేకరణ సెగ్మెంట్ల వారీగా ప్రారంభమైంది. ప్రజలకు ఏం కావాలి. వారు ఏం ఆశిస్తున్నారు?, వారికి ఎలాంటి పథకాల అవసరం ఉందనే అంశాలపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే మేధావులు, మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు, పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, సబ్బండ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. వారితో పాటు ప్రజల నుంచి కూడా మరిన్ని అభిప్రాయాలు ఏప్రిల్ 5వ తేదీ వరకు తీసుకోవాలని భావిస్తోంది.
Lok Sabha Polls 2024 : ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా హామీలు ఇవ్వాలని కాషాయదళం భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ (Congress Paanch Nyay) పేరిట మేనిఫెస్టోను ప్రకటించి ప్రజలకు చేరువకావాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలకు కాంగ్రెస్ చేరువైంది. ఈసారి ఆ అవకాశం హస్తం పార్టీకి ఇవ్వొద్దని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పాంచ్ న్యాయ్‌కు ధీటుగా బీజేపీ మేనిఫెస్టో ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది. మహిళలు,యువతపై మరింత ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టో రూపకల్పనలో తలమునకలైంది. ఇప్పటికే పలువురి అభిప్రాయాలను హైకమాండ్‌కు పార్టీ పంపించినట్లు తెలిసింది. దీనిపై మరింత స్పీడప్ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించి ఏప్రిల్ 5వ తేదీలోపు ఆ నివేదికను సైతం పంపించాలనికాషాయదళం నిర్ణయించుకుంది.