Telangana BJP Chief Kishan Reddy Press Meet : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమికి 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ-మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
నేడు దేశం సాధిస్తున్న ప్రగతికి, మారుమూల ప్రాంతాల వరకు సంక్షేమ పథకాలు చేరుతున్న తీరుతో బీజేపీ(BJP) జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా ఇదే మన మోదీ గ్యారంటీ అని చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఐదు విభాగాలుగా విజయ సంకల్ప యాత్ర(Vijay Sankalpa Yatra) కొనసాగుతోందని వెల్లడించారు. బీజేపీ సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో వచ్చే ఐదేళ్లకు సంబంధించి అజెండా రూపొందించామని వెల్లడించారు.
జోరుగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు - అధికార పార్టీ లక్ష్యంగా నేతల విమర్శలు
Mana Modi Guarantee for India - Once Again Mana Modi Sarkar : మన తర్వాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయని కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా దేశంలో మౌలిక వసతులు లేవని ఆవేదన చెందారు. 2047 కల్లా భారత్(India) ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047లో అధికారంలో ఎవరు ఉంటారనేది ముఖ్యం కాదని, ఆ సమయానికి కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని తెలిపారు.