తెలంగాణ

telangana

ETV Bharat / politics

తెలంగాణ అసెంబ్లీ న్యూ రికార్డ్ - ఏకధాటిగా 17 గంటల పాటు చర్చ - తెల్లవారుజాము 3.15 గంటల వరకు సమావేశాలు - TELANGANA BUDGET SESSION NEW RECORD - TELANGANA BUDGET SESSION NEW RECORD

Telangana Assembly Session New Record 2024 : శాసనసభలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన చర్చ తెల్లవారుజాము 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్​లో 19 పద్దులకు శాసనసభ అమోదం తెలిపింది.

TG ASSEMBNLY SESSIONS 2024
TG ASSEMBNLY SESSIONS 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 8:07 AM IST

Telangana Budget Sessions For 17 Hours : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. సోమవారం రోజున ఈ సమావేశాలు 17 గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు మొత్తం 17 గంటల పాటు అసెంబ్లీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పద్దులపై వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొనగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ సమాధానం చెప్పారు.

ఈ క్రమంలో బడ్జెట్​లోని 19 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, విద్య, వైద్య - ఆరోగ్య శాఖల పద్దులపై శాసనసభలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. తాము ఇచ్చిన కోత తీర్మానాలను మంత్రుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్​ సభ్యుడు హరీశ్ రావు, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ ఉపసంహరించుకున్నారు. అనంతరం పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించిన అనంతరం సభాపతి ప్రసాద్ కుమార్ సభను మంగళవారం ఉదయం పది గంటలకు వాయిదా వేశారు.

పవర్​ వార్​ : అసెంబ్లీ వేదికగా విద్యుత్ ​రంగంపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ - electricity debate in assembly 2024

పదేళ్ల పాలనలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టని నాటి బీఆర్ఎస్​ సర్కారు రాష్ట్రంపై అప్పులభారం మోపిందని ఉప ముఖ్యమంత్రి భట్టి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన విద్యుదుత్పాదననే తమ ఘనతగా చెప్పుకొని రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందని విమర్శించారు. బడ్జెట్‌ పద్దులపై అర్ధరాత్రి దాటాక జరిగిన చర్చలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్యుదుత్పత్తి, సరఫరా మెరుగుపడ్డాయని తెలిపారు. కానీ సోషల్ మీడియా ద్వారా కొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టు పేరిట ఏటా రూ.30,000 కోట్ల భారాన్ని అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం మోపిందన్నారు.ప్రాజెక్టు నుంచి ఫ్లైయాష్‌ తరలించేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆ ప్రాజెక్టుపై ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌) 2022లో నిషేధం విధించగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా చేతులెత్తేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ ఈ రంగం అభివృద్ధికి తమ సర్కారు అధిక కేటాయింపులు జరిపిందని చెప్పారు.

గ్రూప్​-1పై స్పష్టత నిచ్చిన భట్టి : అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. బ్రాహ్మణ పరిషత్తుకు తగినన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు తమ ప్రభుత్వం దృష్టికి వచ్చాయని అయితే నోటిఫికేషన్‌ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించినందున, ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై, పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకోలేదని భట్టి విక్రమార్క తెలిపారు.

నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details