Nara Lokesh Sankharavam Yatra:ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్ర చేపట్టారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేశ్ యాత్ర చేపట్టారు. శంఖారావం యాత్ర నేడు ఇచ్ఛాపురంలో జరిగిన తరువాత పలాస, టెక్కలిలోనూ కొనసాగనుంది. ఈ సభలో లోకేశ్, ఎంపీ రామ్మోహన్, కళా వెంకట్రావు నాయకులు, కార్యకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు. యువగళం (Yuvagalam) పాదయాత్ర జరగని ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఇచ్ఛాపురం రాజావారి గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభ సభలో లోకేశ్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ మోసంపై ఆందోళన వద్దు, అధైర్యపడొద్దు - నిరుద్యోగులకు లోకేశ్ బహిరంగ లేఖ
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే 'సిద్ధం':ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి కంచుకోటని పౌరుషాలు, పోరాటాలకు మారుపేరని అలాంటి ఉత్తరాంధ్రని జగన్ గంజాయి రాజధానిగా మార్చారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు 'సిద్ధం' పేరుతో జగన్ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదని విశాఖలో తహశీల్దార్‌ను కొట్టి చంపారని విమర్శించారు. యువతను మోసం చేసేందుకు డీఎస్సీ పేరుతో జగన్ కొత్త నాటకాలు మొదలు పెట్టారని లోకేశ్ అన్నారు. మోసం, దగా, కుట్రకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌లా ఉంటుందని ధ్వజమెత్తారు. 6 వేల డీఎస్సీ పోస్టుల పేరుతో మళ్లీ మోసానికి సిద్ధమయ్యారన్న లోకేశ్ టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక ఏటా డీఎస్సీ (DSC) నిర్వహిస్తామని హామీఇచ్చారు.
కుటుంబానికే రక్షణ లేదు: జగన్ తన కుటుంబసభ్యులకే రక్షణ కల్పించట్లేదు చెల్లెళ్లు షర్మిల, సునీత తమకే భద్రత లేదంటున్నారు అలాంటి జగన్ సొంత చెల్లెలకే భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటని లోకేశ్ ప్రశ్నించారు. దేశంలో వంద సంక్షేమ పథకాలు కోతపెట్టిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు అండగా ఉండేందుకు రూ.20 వేలు అందిస్తామని ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని 18 నుంచి 59 ఏళ్ల మహిళకు ప్రతి నెల రూ.1500 అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.