ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

టీడీపీ అభిమానులకు గుడ్​న్యూస్ - సభ్యత్వ నమోదు మరో 15 రోజులు పొడిగింపు - TDP MEMBERSHIP REGISTRATION

టీడీపీ సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలని అధిష్ఠానం నిర్ణయం - సభ్యత్వ నమోదులో రికార్డులు తిరగరాస్తున్న టీడీపీ

TDP_Membership
TDP Membership (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2024, 10:17 PM IST

TDP MEMBERSHIP REGISTRATION: సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపు 94 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 63 రోజుల్లో ప్రతిరోజూ సగటున లక్షన్నర మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీతో సభ్యత్వ నమోదు గడువు ముగిసినప్పటికీ పండుగ వరకు పొడిగించాల్సిందిగా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​కు వినతులు అందాయి.

పార్టీ కేడర్​తో పాటు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు గడువు పెంచాలని అధిష్ఠానం నిర్ణయించింది. గతానికి భిన్నంగా ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా గత అయిదేళ్లలో కార్యకర్తల సంక్షేమం కోసం 138 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని నేతలు తెలిపారు.

సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డులు తిరగరాస్తోంది. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదులో నెల్లూరు సిటీ మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరు సిటీ లక్ష 46 వేల 966, పాలకొల్లు లక్ష 44 వేల 992, ఆత్మకూరు లక్ష 34 వేల 584, రాజంపేట లక్ష 2 వేల 783, కుప్పం లక్ష 28 వేల 496, ఉండి లక్ష 14 వేల 443, గురజాల లక్ష 8 వేల 839, వినుకొండ లక్ష 5 వేల 158, మంగళగిరి లక్ష 4 వేల 122 సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి.

యువత నుంచి భారీగా స్పందన వస్తోందని, గత మూడు రోజుల్లోనే 5 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్‌-నికోబార్‌లలో కలిపి కొత్తగా చేరిన వారితోపాటు పాత సభ్యత్వాల్ని పునరుద్ధరించుకున్న వారు ఇందులో ఉన్నారు. త్వరలోనే కోటి సభ్యత్వాలు పూర్తి చేస్తామని టీడీపీ వర్గాలు తెలిపారు.

కోటికి చేరువలో టీడీపీ సభ్యత్వ నమోదు - పరిటాల గ్రామం పసుపుమయం!

ABOUT THE AUTHOR

...view details