TDP Leader Nandamuri Ramakrishna Election Campaign :కృష్ణా జిల్లా నిమ్మకూరులో నేటి నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన రామకృష్ణ, ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల వద్ద ఆశీస్సులు తీసుకున్నారు.
సంక్షేమ పథకాలకు ఆధ్యుడు అన్న ఎన్టీఆర్ : అనంతరం గుడివాడలో రామకృష్ణ ఎన్నికల ప్రచారం ప్రారంభిచారు. రాష్ట్రంలో కూటమి పార్టీలను గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉందని, రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీకి మద్దతుగా ప్రచారం ప్రారంభిస్తున్నానని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయం అయిపోయిందని అన్నారు. టీడీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల సీఎంజగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆరోపించారు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంటే, జగన్ పాలనలో అభివృద్ధి సూచికలో స్థానమే లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరుల ప్రగతి కోసం టీడీపీ పని చేసిందని గుర్తు చేశారు.