TDP leader Ganta Srinivas Rao Responds on Resignation: సీఎం జగన్ దిల్లీ వెళ్లిన ప్రతిసారీ మోదీకి మసాజ్ చేస్తున్నారే తప్పా, ఆయన మెడలు వంచే ప్రయత్నాలు చేయలేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. అందుకే తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి పట్టించుకోలేదని గంటా ఎద్దేవా చేశారు. తాను విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశానని పేర్కొన్నారు. అయితే, గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తన రాజీనామాను, కేవలం రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవడానికి ఆమోదించారని గంటా ఆరోపించారు.
ఆ మూడు సీట్లు గెలవాలనే రాజీనామాను ఆమోదించారు: విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం సీఎం జగన్ గట్టిగా మాట్లాడలేదని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్‌ప్లాంట్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్సార్సీపీ స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తే తాను రాజీనామాయే చేసే వాడిని కాదని గంటా తెలిపారు. సీఎం జగన్ పై ఉన్న కేసుల కారణంగా ప్రధాని మోదీతో గట్టిగా మాట్లాడలేదని ఆరోపించారు. 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి, తన రాజీనామా ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్‌ను కోరానని తెలిపారు. ఉపఎన్నిక భయంతోనే తన రాజీనామాను ఇన్నాళ్లూ ఆమోదించలేదన్న గంటా, తాజాగా రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్‌కు గుర్తుందని, అందుకే అప్పుడు తన రాజీనామాను ఆమోదించలేదని ఆరోపించారు.
తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో 3 సీట్లూ గెలవాలనే తన రాజీనామాను ఆమోదించారని గంటా పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం రాజీనామాలే కాదు, అంతకు మించిన త్యాగాలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సీఎం జగన్ విలువలకు సిలువలు వేస్తున్నారని గంటా శ్రీనివాస్ విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయగలరా? అంటూ ప్రశ్నించారు. జగన్ పరిపాలనపై వైఎస్సార్సీపీ నేతలూ చాలా అసంతృప్తిగా ఉన్నారని ఆరోపించారు.