TDP Btech Ravi Challenge to YS Avinash Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (Viveka Murder Case) తన ప్రమేయం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధ పడాలని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సవాల్ విసిరారు. సొంత పత్రికలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఆరోపణలు చేసే విధంగా కథనాలు రాశారని మండిపడ్డారు. వివేకా కేసులో తాను కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని, అవినాష్ సైతం సిద్ధ పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలలోపే దీనికి సిద్ధం కావాలని పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి ప్రమేయంపై మాట్లాడితే బీజేపీలోకి వెళ్తాడని సునీతతో జగన్ చెప్పింది నిజం కాకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయగలడా అని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారనే విషయం రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ నిర్ధరణకు వచ్చిందని, కానీ హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మీడియాకు ఏ విధంగా చెప్పారని, ఎలా తెలిసిందని బీటెక్ రవి నిలదీశారు.
వివేకాను హత్య చేసే సమయంలో నిందితులు వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డికి, జగన్‌కు పంపించారనే సమాచారం తమకు ఉందని బీటెక్ రవి ఆరోపించారు. హత్య జరిగే ముందు రోజు సునీల్ యాదవ్ అనే వ్యక్తి భాస్కర్ రెడ్డి ఇంట్లో నుంచే దస్తగిరికి గొడ్డలికి అయ్యే ఖర్చును ఫోన్ పే ద్వారా ఇచ్చారనే విషయాన్ని సీబీఐ గుర్తించిందని వెల్లడించారు. వైఎస్ కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేసినట్లు అన్ని అధారాలున్నా ఇంకా బుకాయించే విధంగా మాట్లాడటం, వారి సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాయడం ఏంటని ప్రశ్నించారు.
జగన్ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్ సునీత