Old Man Murder For Money in YSR District : వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలోని శెట్టివారిపల్లెలో ఓ వృద్ధుడి అనుమానాస్పద మరణం హత్య కేసుగా మారింది. నిర్మాణలో ఉన్న ఇంటి వసారాలో నిద్రిస్తున్న వృద్ధుడిని ఇద్దరు గుండెలపై నొక్కి హత్య చేసినట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. తాజాగా ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అప్పటి వరకు సాధారణ మరణంగా భావించిన పోలీసులు హత్య కేసుగా ద్రువీకరించారు. గత ఏడాది డిసెంబరు 6వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌కు తెలియడంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా మానవతా ధృక్పథంతో పరిశీలించి అసలు విషయం నిగ్గుతేల్చాలని వారికి సూచించారు. ఈ మిస్టరీని తేల్చాలని డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
నడిరోడ్డుపై భర్తను ఉరితీసి చంపిన భార్య!
అసలేం జరిగిందంటే: ప్రొద్దుటూరు మండలం ఉప్పాగుకాలనీకి చెందిన వీరారెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కుమారుడు రాఘవరెడ్డితోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్యకు ఒక కుమారుడు ఉన్నారు. అందరు కలిసి శెట్టివారిపల్లెలో నివసించేవారు. ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరగడంతో వీరారెడ్డి రెండో భార్యతో ప్రొద్దుటూరులో వేరు కాపురం పెట్టారు. మొదటి భార్య కుమారుడు రాఘవరెడ్డి విద్యుదాఘాతంతో మృతి చెందగా ఆ తర్వాత ఇద్దరు భార్యలు అనారోగ్యంతో మృతి చెందారు. ఆర్నెళ్ల కిందట వీరారెడ్డి తన పేరున ఉన్న ఎకరా పొలాన్ని రూ.7 లక్షలకు అమ్మి వచ్చిన డబ్బుతో ఫైనాన్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈక్రమంలో పొలం అమ్మిన డబ్బు తనకే ఇవ్వాలని మనవడు హరినాథరెడ్డి తరచూ గొడవ పడుతూండేవాడు. అందరికీ సమానంగా ఇస్తానని వీరారెడ్డి చెబుతున్నా వినేవాడు కాదు. గతనెల 6న బంధువైన నారాయణరెడ్డి తన తండ్రి వీరారెడ్డి మృతి చెందిన విషయాన్ని చెప్పడంతో కుమ్మల రమేష్ తన భార్య దుర్గతో గ్రామానికి చేరుకుని మొదటిభార్య వారసులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం హరినాథరెడ్డి అతని స్నేహితుడు కలిసి తన తండ్రి వీరారెడ్డి గొంతు పిసికి నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపారని గ్రామస్థుల ద్వారా తెలిసిందని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రమేష్ పోలీసులను కోరారు. వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చిరంజీవి చెప్పారు. వీరారెడ్డి మృతిపై విచారణ చేస్తున్నామని సీఐ సయ్యద్ హాసం తెలిపారు. కుమ్మల రమేష్ గురువారం ఫిర్యాదు చేయడంతో మొదటి భార్య మనమడు హరినాథరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.