ప్రజాగళం సభలో ఉప్పొంగిన జనసునామీ- 3పార్టీల అభిమానులతో నిండిపోయిన గ్యాలరీలు TDP BJP Janasena Prajagalam Public Meeting: పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభకు ప్రజలు ఉరకలెత్తిన ఉత్సాహంతో తరలివచ్చారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్న కసితో కదం తొక్కారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా సొంత వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మండుటెండనూ లెక్క చేయకుండా కాలినడకన వచ్చారు. మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చారు. వృద్ధులు, వికలాంగులు సైతం సభకు తరలివచ్చారు.
ఏపీలో ఎన్డీఏ సభపై ప్రధాని మోదీ ట్వీట్లు - ఏమన్నారంటే?
ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ వేల సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు. సభా ప్రాంగణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారి రెండు పక్కలా జనంతో కిక్కిరిసిపోయింది. చాలా మంది నాయకులు, కార్యకర్తలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి సభకు హాజరుకాలేకపోయారు. మరికొంత మంది అభిమానులు పొలాల మీదుగా నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రజాగళం సభ ఘనవిజయంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ
ప్రజాగళం సభకు మూడు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావటంతో హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసుల నిర్వాకం వల్ల ట్రాఫిక్ స్తంభించి నాలుగు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. పార్టీ స్టిక్కర్లు, జెండాలు లేవన్న కారణంతో కొన్ని వాహనాలను చీరాల, అద్దంకి వైపు మళ్లించారు. దీనికి తోడు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పోలీసులు ఆంక్షలతో ఎటు వెళ్లాలో తెలియక చాలా మంది గ్యాలరీలకు వెలుపలే నిలిచిపోయారు. మూడు పార్టీల ముఖ్య నాయకులు అవస్థలు పడ్డారు.
ఎన్డీయే కూటమి ఆదివారం నిర్వహించిన "ప్రజాగళం" సభ సామాజిక మాధ్యమం ఎక్స్ ట్రెండింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ విన్నింగ్ పేరుతో ట్రెండింగ్‌లో కొనసాగింది. అధిక సంఖ్యలో అభిమానులు దీన్ని ట్యాగ్ చేశారు. పవన్‌కల్యాణ్, ఏపీ వెల్ కమ్స్ నమో పేరుతో ట్రెండ్ అయింది.
ప్రజాగళం సభావేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ - జనసందోహంగా మారిన బొప్పూడి