YS Vivekananda Reddy murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత రెడ్డి ఆరోపించారు. హత్య చేసిన వారిని వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగి ఐదేళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని వెల్లడించారు. తనకు చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని మరో మారు గెలవకుండా చేయడమే తన ప్రయత్నమని సునీత పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడిన ఆమె, వివేకా హత్యకు గల కారణాలను వెల్లడించారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని, న్యాయం కోసమని స్పష్టం చేశారు. 2009కి ముందు వైఎస్‌ఆర్, వివేకా ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేసేవారని, వైఎస్‌ఆర్ చనిపోయిన సమయానికి వైఎస్ జగన్ ఎంపీగా ఉన్నారని తెలిపారు. అయితే, పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. ఈ చర్చలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆయన పోటీ చేయడాన్ని వివేకా అంగీకరించలేదని సునీత గుర్తుచేశారు. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేకా చెప్పారన్నారు. ఈ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని, దీనిని జగన్ వ్యతిరేకించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత జగన్, విజయమ్మ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బయటకు వచ్చారని, 2011 ఉప ఎన్నికలో జగన్, విజయమ్మ పోటీ చేశారని సునీత గుర్తు చేశారు. ఆ తర్వాత జగన్‌తో ఉండాలని నిర్ణయించి వివేకా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు.