Subbarao mother blamed the revenue officials: సుబ్బారావు కుటుంబం బలవన్మరణం చేసుకోవడానికి ప్రధాన కారణం తనకున్న 3 ఎకరాల పొలాన్ని వేరొకరి పేరుతో ఆన్ లైన్లో మార్చేయడమేని, ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికే పోలీసులు, రెవిన్యూ అధికారులు కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్బారావు తల్లితో ఈటీవీ భారత్ మాట్లాడగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇద్దరు ఎమ్మార్వోలకు లక్షల్లో:సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై అతని తల్లి రామలక్ష్మమ్మ స్పందించారు. ఆ 3 ఎకరాల భూమిని గతంలో నా భర్త సాగు చేసేవాడు. నా భర్త మరణించిన తరువాత నా కుమారుడు సుబ్బారావు ఆ భూమిని సాగుచేస్తున్నాడు. ఆ భూమికి సంబంధించి మూడు సార్లు పీఎం కిసాన్ యోజన డబ్బులుపడ్డాయి. అయితే, భూమి మా పేరు నుంచి శ్రావణి పేరు మీద మార్చారు. భూమి వేరే వ్యక్తి పేరుపై మారడంతో, సుబ్బారావు గత కొంత కాలంగా ఆందోళన చెందారు.
ఇదే విషయమై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఇద్దరు ఎమ్మార్వోలకు లక్షల్లో డబ్బులు ముట్టజెప్పాడు. నా కుమారుడి దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకోని అతనికి అధికారులు అన్యాయం చేశారు. భూమి చేతికి రాకపోవడంతో అప్పులు చేశాడు. ఇక భూమి దక్కదని ఆందోళన చెంది కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. రికార్డుల్లో మారిన తమ 3 ఎకరాల భూమిని తిరిగి సుబ్బారావు కుతురి పేరుపై ఎక్కించాలి. ప్రభుత్వం తరఫున సహాయం చేయడంతో పాటుగా, సుబ్బారావు కుతురిగి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సుబ్బారావు తల్లి రామలక్ష్మమ్మ డిమాండ్ చేశారు.