YSRCP Corporators who Joined TDP in Visakha:విశాఖలో వైఎస్సార్సీపీకి ఎదురుగాలి తగిలింది. కూటమి పక్షంలో భారీగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేరారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కంపా హనుకో, గోవింద్, అప్పారావు, నరసింహపాత్రుడు, అప్పల రత్నం, వరలక్ష్మి, రాజారామారావు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు.
ఈ చేరికల ఫలితంగా జీవీఎంసీలో కూటమి బలం పెరుగుతుందిని తెలిపారు. ఇప్పటికే నగరంలో టీడీపీ కార్పొరేటర్లు 33 డివిజన్లు గెలవగా, 4 డివిజన్లు జనసేనా కార్పొరేటర్లు గెలిచారు. ఈ క్రమంలో కూటమి పక్షాన సంఖ్యాబలం పెరుగుతోందని అన్నారు. ఈ చేరికల ఫలితంగా కొద్ది రోజుల్లో జరగబోయే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలలో కూటమి గెలుపునకు మార్గం సులువు అవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మరో నలుగురు జనసేన పార్టీలోకి నేరుగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కొంత మంది కూటమి పక్షంలో రావడానికి సిద్దంగా ఉన్నారని టీడీపీ నేత పైలా శ్రీనివాసరావు తెలిపారు.