Kishan Reddy Interview with ETV Bharat: రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ప్రజలు ఓటు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇష్టం లేకపోయినా అప్పుడు ఆ పార్టీని గెలిపించారని తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ పార్టీకి సానుకూలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని వివరించారు. బీజేపీని ఆశీర్వదించాలని 'ఈనాడు- ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని ముఖ్య విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం!
- ప్రశ్న : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు?
సమాధానం : సీఎం రేవంత్‌రెడ్డి అసలు విషయాలను పక్కన పెట్టేస్తారు. లేని సమస్యలు సృష్టిస్తారు. ప్రజలను గందరగోళపరిచి ఆందోళనకు గురి చేయాలని చూస్తున్నారు. రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లకు పైగా ఇస్తే ఆయన ఇలా మాట్లాడతారా? సీఎం స్థాయిలో వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదు. మరి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మేం ఏమనాలి? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వలేదు. ఇంకా అమలు కానివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏమనాలి? ప్రజలకు అది గాడిదగుడ్డు ఇచ్చిందా అని అనాలి.
అసెంబ్లీ ఎన్నికలప్పుడే తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చిందో స్పష్టంగా వివరించా. ఎంత ఇచ్చింది, ఎంత ఖర్చయింది అనేది అంతా బహిరంగమే. కేంద్రం ఏమి ఇచ్చిందో సీఎం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఇలా మాట్లాడి రేపు కేంద్రం వద్దకు ఎలా వస్తారు? ఏం అడుగుతారు? కేంద్రంతో సరైన సంబంధాలు లేకపోవడంతో రాష్ట్రం నష్టపోయిందని సీఎం సహా మంత్రులు అంతా మాట్లాడారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటా అని అన్న సీఎం ఇప్పుడు ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
- ప్రశ్న : ఇటీవల జరిగిన అసెంబ్లీ పోరును, ఈ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే మీ పార్టీ పరంగా గమనించిన అంశాలు ఏమిటి?
సమాధానం: అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల మేం బలంగా వెళ్లలేకపోయాం. ఓట్లు శాతం పెరిగింది. సీట్లు సంఖ్య కూడా ఒకటి నుంచి ఎనిమిదికి చేరుకున్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అప్పట్లో బీఆర్ఎస్పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందగా మేం అనుకున్న మేర స్థానాలు పొందలేకపోయాం. లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి వేరు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు తేడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నవి దేశానికి సంబంధించినవి. మోదీ నాయకత్వంలో సాధించిన విజయాలపై ప్రజా తీర్పు రాబోతుంది. కచ్చితంగా బీజేపీకి ప్రత్యేకమైనవి, అనుకూలమైనవి కూడా.
బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తుంది: కిషన్‌రెడ్డి - kishan reddy on Congress
- ప్రశ్న : పార్టీ గెలుపుపై మీ ధీమాకు కారణాలు ఎలా ఉన్నాయి?
సమాధానం: మా పార్టీ ఎక్కువ సీట్లలో గెలుస్తుందని తెలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీపై అన్యాయపు దాడులు, బట్ట కాల్చి మీదవేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని మరిచిపోయారు. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు తాను ఏం చెబితే అది వింటారని అనుకునేవారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారు.
- ప్రశ్న : విభజన హామీలు అమలు చేయలేదని కేసీఆర్ అంటున్నారు?
సమాధానం: ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ విభజన హామీలపై దుష్ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బదులు కోచ్‌లు, వ్యాగన్‌లు, ఇంజిన్లు తయారు చేసే ఫ్యాక్టరీ పెడితే నాడు కేసీఆర్ ప్రారంభోత్సవానికి రాలేదు. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి వచ్చి కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. అదనంగా వ్యాగన్లు, ఇంజిన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఎందుకు పెడుతున్నారని అడగవచ్చు కదా? విభజన హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆచరణ సాధ్యం కాదని 50 సార్లు చెప్పాం. 2018 ఎన్నికల్లో ఆ పరిశ్రమ పెడతామని చెప్పి, గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పెట్టలేదో ప్రజలకు చెప్పాలి.
- ప్రశ్న : ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో మీరు ఏమి చేస్తారు?
సమాధానం: గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రూ.9 లక్షల కోట్లకు పైగా వ్యయం చేసింది. రామగుండం యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటైంది. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభమైంది. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చింది. రక్షణ రంగంలో అనేక కొత్త యూనిట్‌లు వచ్చాయి. రూ.26 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్ వచ్చింది. 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ వచ్చింది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఏవి హక్కుగారావాలో అవి తీసుకువస్తాం. రాష్ట్ర అభివృద్ధికి దృష్టి పెడతాం.
- ప్రశ్న : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను మీరు ఎలా చూస్తున్నారు?