Cabinet Expansion in Telangana :తెలంగాణరాష్ట్ర కేబినెట్ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా, మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇటీవల ఐదు రోజులపాటు దిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. సామాజిక సమీకరణాల ఆధారంగా నాలుగు మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమలకు ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల వేళ ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేరు గట్టి వినిపిస్తోంది. అయితే.. ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే దిశలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
నాడు ఎన్టీఆర్ క్యాబినెట్లో నేడు చంద్రబాబు జట్టులో- ఆ మంత్రులెవరో తెలుసా? - ap ministers list
బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రి పదవి పక్కా అయ్యిందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావుకు అమాత్యయోగం పట్టనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లి, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంపై తుదిచర్చలు జరపనున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.