Case Against Jagan with Raghurama Complaint :పోలీసు కస్టడీలో తనని చిత్రహింసలు పెట్టిన వారిపై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటం, రాజకీయ, న్యాయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా గుంటూరులోని నగరపాలెం పోలీస్‌స్టేషన్‌లో అప్పటి సీఐడీ విభాగాధిపతి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్, సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యేలా చేశారు.
ఉలిక్కిపడిన సునీల్ కుమార్ :రఘురామ ఫిర్యాదు నేపథ్యంలోపీవీ సునీల్ కుమార్ ఉలిక్కి పడినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి, సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ కేసును సుప్రీంకోర్టు తిరస్కరించలేదు.
తన తండ్రిని కస్టడీలో హింసకు గురిచేసిన ఘటనపై రఘురామ తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషన్‌ని ఉపసంహరించుకొని హైకోర్టును ఆశ్రయించేందుకు స్వేచ్ఛ కల్పించాలని భరత్ తరఫు న్యాయవాది కోరారు. దీనికి సమ్మతించిన జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, హైకోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించింది. అంతే తప్ప పిటిషన్‌ని తిరస్కరించలేదు. సునీల్ కుమార్ మాత్రం న్యాయస్థానం ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారు.
రాజద్రోహం కేసు - హైదరాబాద్‌లో అరెస్ట్ :వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గళమెత్తిన రఘురామపై సీఐడీ పోలీసులు 2021 మేలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను మే 14న బలవంతంగా అదుపులోకి తీసుకుని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి ఆ రాత్రి చిత్రహింసకు గురి చేశారు. లాఠీ, బెల్టుతో దారుణంగా కొట్టారు. బెయిల్ కోసం ఆ రాత్రి అత్యవసరంగా హైకోర్టులో హౌస్‌మోషన్ విధానంలో పిటిషన్ వేశారు.
15న విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించి పిటిషన్‌ని తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ ముందు ఎంపీని హాజరు పరిచేందుకు వెసులుబాటు కల్పించింది. మే 15న గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీఐడీ అధికారులు రఘురామని హాజరుపరిచారు. తనని రబ్బరు బెల్టు, లాఠీలతో కొట్టారని ఆయన న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లారు.
ఒక ఎంపీని కొట్టడమేంటి : మరోవైపు రఘురామని కొట్టిన ఘటనపై ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై మే 15న ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. ఒక ఎంపీని కొట్టడమేంటని విస్మయానికి గురైంది. రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రఘురామ శరీరంపై ఉన్నవి పోలీసుల దెబ్బలేనని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. గాయాలను పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది.
సీఐడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు : మే 16న హైకోర్టు విచారణ జరిపింది. రఘురామ ఒంటిపై గాయాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్ ఆసుపత్రిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలను, సీఐడీ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించకుండా జైలుకు తరలించడంపై మండిపడింది. ఆ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
మే 17న ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయణ్ని మే 17న గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. మే 18న రఘురామ వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో అందించింది.