Raghanandan Rao Sensational Comments : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని బీజేపీ నేత రఘునందన్ రావు(Raghanandan Rao) పేర్కొన్నారు. సమీకరణల మేరకు నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి(MP Ranjith Reddy), జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరిద్దరు పార్టీ మారడం వెనక వేలకోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపించారు.
RaghunandanRao Fires on Jitender Reddy : ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి కూడా అలాగే వచ్చారని, బీజేపీలో చేరిన సమయంలో పార్టీ గురించి అద్భుతంగా మాట్లాడినట్లు రఘునందన్‌రావు పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో జితేందర్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తే సిద్దాంతాలు ఉన్న పార్టీనా..?, టికెట్ రాకపోతే సిద్దాంతాలు లేని పార్టీనా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలోకి ఏ నిర్మాణ కంపెనీకి లాభం చేకూర్చుకునేందుకు ఇరువురు వెళ్లారని రఘునందన్‌రావు ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటీ? వాటి ద్వారా వారి ఆర్థిక ప్రయోజనాలు ఏంటీ? వారికి ఉన్న వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటీ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సదరు విషయాలు తమకు అన్ని తెలుసని, అన్ని సమాచారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందరి కంటే ఎక్కువ లబ్ది పొందిన ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి జితేందర్‌రెడ్డి నిర్మాణ పనులు చేశారన్నారు. షేక్ పేటలో 443, 403 జరుగుతున్న భూ భాగోతాలపై ఈడీకి, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు.