Public Money For YSR Statues in Idupulapaya : ఇడుపులపాయలోని వైఎస్సార్ స్మారక రాజీవ్ నాలెడ్జి వ్యాలీలో ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు మొత్తం 23. ఇందుకోసం అక్షరాలా రూ.10 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 48 అడుగుల ఎత్తయిన ఒక విగ్రహానికే రూ.7.61 కోట్లు వెచ్చించారు. ఇంకో 22 విగ్రహాలకు మరో రూ.2.39 కోట్లు ఖర్చు చేశారు. ఇక్కడితో సరిపెట్టలేదు. విగ్రహాలకు విద్యుద్దీపాల అలంకరణ, చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో రూ.8 కోట్లు వెచ్చించారు.
మంచినీళ్లప్రాయంగా ప్రజాధనం ఖర్చు : ఇలా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇడుపులపాయలో రూ.18 కోట్లను మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టేసింది. ఈ పనులకు సంబంధించి పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ -పాడా ద్వారా రూ.15.43 కోట్లు మంజూరు చేయించారు. పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.14.07 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అర్బన్ గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో రూ.4 కోట్ల వరకు వ్యయం చేశారు.
YSR Statues in Idupulapaya :పనులన్నీ జగన్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కట్టబెట్టారు. ఇతరులు టెండర్లు వేయకుండా జగన్ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విగ్రహాల ఏర్పాటు, ఇతర పనులకు సంబంధించిన మొత్తం రూ.14 కోట్ల టెండర్‌ను ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్ 4.26 శాతం ఎక్సెస్‌కు దక్కించుకుంది. ఈ క్రమంలోనే మరో డమ్మీ గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్‌జేఆర్ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ వేయించారు. అంతకంటే తక్కువ మొత్తానికి కోట్ చేశారంటూ ఎన్‌జేఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు అప్పగించింది.