Balineni Srinivasa Reddy to Resign YSRCP? : 'నిన్నామొన్నటి వరకు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ పెద్దన్నలా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మరో బాంబు పేల్చారు. తనకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో కొనసాగలేనంటూ నేరుగా ఆ పార్టీ అధినేత జగన్‌కే చెప్పేశారు. తన దారి తాను చూసుకుంటానని తేల్చేశారు. ఆయన జనసేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు' అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదంతా నిజమేనా, పార్టీలో తన ప్రాబల్యాన్ని తిరిగి పెంచుకునేందుకు సాగిస్తున్న వ్యూహమా అనేది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
Balineni Srinivasa Reddy Join Janasena :సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్‌ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.
జిల్లా బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? :సుమారు 3 నెలలుగా ఒంగోలుకు, వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్న బాలినేని, ఎట్టకేలకు బుధవారం రాత్రి తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు ఇరవై నిమిషాల పాటు వారిద్దరి మధ్య వాడీవేడి చర్చ సాగినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని జగన్ చేసిన ప్రతిపాదనను బాలినేని తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి నుంచి తప్పించి అవమానించారని, ఆ తర్వాత తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, ప్రస్తుతం తనకు జిల్లా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం.
పూర్వ వైభవం కోసం పాకులాట? :బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ ఛీప్ పవన్ కల్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో భిన్నమైన ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికీ ఆయన పవన్ కల్యాణ్‌తో సమావేశం కాలేదని, జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ రాలేదని కొందరు చెబుతున్నారు. వైఎస్సార్సీపీలో కీలక నాయకుడిగా వెలిగిన బాలినేని చేరికకు కూటమి అగ్రనేతల సమ్మతి కూడా అవసరమవుతుందని అంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ పూర్వ వైభవం కోసం బాలినేని ఆడుతున్న వ్యూహాత్మక నాటకం అనే ప్రచారం సైతం సాగుతోంది.