Problems in Andhra Pradesh New Districts: కొత్త జిల్లాల ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం జగన్ గొప్పగా మాటలు చెప్పారు. కానీ జరిగిందేంటి? 16 నెలలు గడిచినా సమీకృత కార్యాలయ భవన నిర్మాణం ఎక్కడా ప్రారంభం కాలేదు. చాలా చోట్ల కలెక్టర్, ఎస్పీ సహా ప్రభుత్వ విభాగాలు అద్దె కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లలోనే నెట్టుకొస్తున్నారు. జిల్లాలు ఏర్పడిన కొన్ని రోజులకే జిల్లా కేంద్రాల్లో ఆస్తుల మార్కెట్ విలువల్ని పెంచేసిన ప్రభుత్వం భవనాల నిర్మాణం, వసతుల కల్పనపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
అనకాపల్లి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సహా 90 శాతం జిల్లా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కలెక్టర్, జేసీతోపాటు జిల్లా అధికారులంతా అద్దె భవనాల్లోనే నివాసముంటున్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలు ఇంకా శాఖ కేంద్రంగానే నడుస్తున్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ను కొత్తగా నిర్మించిన ఐటీడీఏ కార్యాలయం భవనంలో, ఎస్పీ కార్యాలయాన్ని వైటీసీ భవనంలో ఏర్పాటు చేశారు.
మూతపడిన మిషనరీ పాఠశాల భవనంలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు పలు విభాగాలు అసౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తున్నాయి. కొన్ని విభాగాలు బడిలో పిల్లల బల్లల్నే వినియోగిస్తున్నాయి. నర్సిపురం గ్రామ సచివాలయ భవనంలో నడుస్తున్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఇరుకుగా మారి జనాలే వెనుదిరగాల్సి వస్తోంది. ఒకే గదిలో ఏర్పాటైన జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏ అధికారి హోదా ఏంటో, వారి విధులేంటో అర్థంకాని గందరగోళం నెలకొంది.
నెలకు 2 లక్షలకుపైగా అద్దె ఇచ్చి: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు ఎస్పీ కార్యాలయాన్ని నెలకు 2 లక్షలకుపైగా అద్దె ఇచ్చి ఓ ఫంక్షన్ హాల్లో నడిపిస్తున్నారు. ఇక ఈ జిల్లా కలెక్టరేట్ 2 కిలోమీటర్ల దూరంలోని యువజన శిక్షణ కేంద్రంలో ఏర్పాటైంది. దేవదాయ, సాంఘిక, బీసీ సంక్షేమం వంటి విభాగాలకు కార్యాలయాల్లేవు. మరో 8 విభాగాలు డిగ్రీ కళాశాల భవనంలోనే పనికానిస్తున్నాయి. ఇక్కడ కనీసం మరుగుదొడ్లైనా లేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అధికారులు విశాఖ, అనకాపల్లి, చోడవరం వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. రిజిస్ట్రార్, ఆర్టీవో, వ్యవసాయ, ఉద్యాన, అగ్నిమాపక, దేవదాయశాఖ అధికారులు ప్రతి శుక్రవారం పాడేరులో నిర్వహించే స్పందనకు మాత్రమే హాజరవుతున్నారు. 200 కిలోమీటర్ల నుంచి రంపచోడవరం రెవెన్యూ డివిజన్ వాసులకు జిల్లా కేంద్రానికి రావాలంటే తీవ్ర వ్యయప్రయాసలు తప్పడం లేదు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ అమలాపురంలోని డీఆర్డీఏ శిక్షణ కేంద్రంలో ఏర్పాటైంది. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల భవనాల్లో 24 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు పెట్టారు. ఇందుకు నెలకు 12 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఎస్పీ కార్యాలయమూ అద్దె భవనంలోనే నడుస్తోంది. చాలా ప్రభుత్వ విభాగాలు ఇంకా కాకినాడలోనే ఉన్నాయి. విద్యుత్ శాఖ రాజమహేంద్రవరం కేంద్రంగానే పనిచేస్తోంది. కొన్ని విభాగాలు స్టేషనరీ, ఇతర అవసరాలకు ఓఎన్జీసీ, ఇతర సంస్థల్ని బతిమాలుకుని సీఎస్ఆర్ నిధులతో సమకూర్చుకుంటున్నాయి.
మురుగుకాలువ పక్కనే: తూర్పుగోదావరి కలెక్టరేట్ రాజమహేంద్రవరం న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటైంది. 14 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వైటీసీ నుంచి పనిచేస్తున్నాయి. డీఆర్డీఏ కార్యాలయం ఆవ మురుగుకాలువ పక్కనే ఏర్పాటు చేయడంతో సిబ్బంది దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారు. డీపీవో ఆఫీస్‌లో సుమారు 12 మంది ఒకే గదిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఫీస్‌లో కనీసం ఫర్నిచర్, కంప్యూటర్లు కూడా లేవు. డ్వామా, పరిశ్రమల శాఖ, అగ్నిమాపక, ఇతర కార్యాలయాలు అధ్వానంగా ఉన్నాయి. కలెక్టరేట్ వరకు సరైన ప్రయాణ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
లక్ష రూపాయలు బకాయి - అద్దె చెల్లించలేదని సచివాలయానికి యజమాని తాళం
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ను భీమవరానికి 4 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్‌కి ప్రధాన రహదారి నుంచి పొలాల మధ్య చాలా దూరం వెళ్లాల్సి రావడంతో జనం అవస్థలు పడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీలు అద్దె భవనాల్లో నివాసం ఉంటున్నారు. విద్యుత్, నీటిపారుదల, సంక్షేమ శాఖల కార్యాలయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కార్యాలయాలు ఏలూరు నుంచే పనిచేస్తున్నాయి.
విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌గా మార్చేశారు. ఇది కార్యాలయ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. బాపట్లలో కలెక్టర్‌కు క్యాంప్ కార్యాలయం లేదు. 16 కిలోమీటర్ల దూరంలోని చీరాల ఐఎల్టీడీ అతిథిగృహం తాత్కాలిక క్యాంప్ కార్యాలయం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీహెచ్ఆర్డీ, పంచాయతీరాజ్ శిక్షణ కేంద్రం భవనాలే కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలకు దిక్కయ్యాయి.