Prime Minister Modi Telangana Tour: రాష్ట్రంలో ప్రధాన పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు. బీజేపీ డబుల్ డిజిట్లో సీట్లు గెలవాలని లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో ముందుకు సాగుతోంది. పార్టీ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరుతున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద భారీ బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. మూడోసారి కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేస్తామనే విషయాలను ఇక్కడ ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
PM Modi Election Campaign in Telangana : జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మోదీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం దాదాపు 4.30 గంటల సమయంలో ప్రధాని సభా స్థలికి చేరుకొని ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ల నుంచి దాదాపు రెండు లక్షల మంది కార్యకర్తలను సభకి తరలించేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భద్రతా సిబ్బంది హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. సభా స్థలిని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకోంది. పటిష్ట బందోబస్తు నడుమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభ అనంతరం హెలికాప్టర్‌లో దుండిగల్‌కు చేరుకుంటారు. దుండిగల్ విమానాశ్రయం నుంచి ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన - షెడ్యూల్ ఇదే - PM MODI Telangana Tour 2024