Kadapa Lok Sabha Elections 2024 : సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్‌లో ఎన్డీఏ కూటమి కాలుదువ్వుతోంది. మూడు నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మరో మూడుచోట్ల వైఎస్సార్సీపీతో హోరాహోరీగా తలపడుతోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు పలు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. ఇది వైఎస్సార్సీపీకి ఊహించని పరిస్థితే. అందుకే చివరి అస్త్రంగా ఆ పార్టీ డబ్బు వెదజల్లుతోంది. గత ఐదేళ్లూ పులివెందుల మినహా మిగతా నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇప్పుడు ఇదే కీలకంగా మారాయి. అటు కడప పార్లమెంట్ పోటీ రసవత్తరంగా మారిందని 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి పరిశీలనలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మాధవీరెడ్డి V/S అంజాద్‌బాషా : వైఎస్సార్ జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కడప గడపలో ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం అభ్యర్థి మాధవీరెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా అంజాద్‌బాషా వరుసగా రెండుసార్లు గెలిచి మూడోసారి బరిలో ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అభివృద్ధిని, సమస్యల్ని పట్టించుకోలేదని ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలూ పుంఖానుపుంఖాలు. పెద్దదర్గా పరిధిలోని కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ముస్లింలు వాపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ఖాన్ ముస్లిం ఓట్లను భారీగా చీల్చనున్నారు.
పుట్టా సుధాకర్‌యాదవ్ V/S శెట్టిపల్లి రఘురామిరెడ్డి : గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన పుట్టా సుధాకర్‌యాదవ్‌పై సానుభూతిపవనాలు వీస్తున్నాయి. ఆయనకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈసారి గెలుపు 'పుట్టా'దే అని స్పష్టంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుకను, మట్టినీ వదల్లేదని ప్రజలు చెబుతున్నారు. గత ఎన్నికలు జగన్ కేంద్రంగానే నడిచాయని, తామంతా అప్పట్లో వైసీపీకే ఓటేశామని, ఈసారి ఆ పరిస్థితి లేదని మైదుకూరు నగర పరిధిలోని 8 మంది మధ్యవయస్కులు చెప్పారు. నియోజకవర్గంలో కీలక ఓటు బ్యాంకు కలిగిన డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీకు మద్దతుగా నిలవడం ఆ పార్టీకి మరింత కలిసొచ్చే అంశం.
ఆరంభంలోనే కడపలో జెండా ఎగరేసిన టీడీపీ - షర్మిల రాకతో రసవత్తర పోరు - kadapa LOK SABHA ELECTIONS
వరదరాజులరెడ్డి V/S రాచమల్లు శివప్రసాద రెడ్డి :ప్రొద్దుటూరులో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకనే ప్రచారం సాగుతోంది. ఈసారి గెలిచేది పెద్దాయన వరదరాజులరెడ్డి అని ఎక్కువమంది నోట వినిపిస్తోంది. చివరి అస్త్రంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి డబ్బును ప్రయోగిస్తున్నారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య బీసీల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఇక్కడ బీసీల ఓట్లు 60వేల వరకు ఉన్నాయి. రాచమల్లు అవినీతిపైనా నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. గత ఐదేళ్లలో అడ్డగోలుగా సాగిన క్రికెట్ బెట్టింగ్, ఇసుక మాఫియా ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి. బంగారు అంగళ్ల వ్యవహారం, తాత్కాలిక మార్కెట్లో గదుల కేటాయింపులో వసూళ్లు, బినామీ పేరుతో చర్చి భూముల కొనుగోలు కీలకం కానున్నాయి.
బొజ్జా రోషన్న V/S డాక్టర్ దాసరి సుధ :బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయినా, బలమైన సామాజికవర్గాలే అనుచరుల్ని దింపి రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈసారి ఇక్కడ టికెట్ బీజేపీకు దక్కడంతో బొజ్జా రోషన్న పోటీ చేస్తున్నారు. ఎన్డీయే బలమైన పోటీ ఇస్తున్నా గెలుపు అవకాశాలు వైసీపీకే ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని, గ్రామాల్లో ఎక్కడా పట్టు సడలనివ్వడం లేదని పెద్దుళ్లపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చెప్పారు. వ్యాపారవర్గాలు కూటమి వైపు మొగ్గుచూపుతున్నారని, ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీనే అని వీరారెడ్డి సర్కిల్లోని ఓ వ్యాపారి తెలిపారు. వైఎస్సార్సీపీ తరుఫుల ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు.
ఆదినారాయణరెడ్డి V/S సుధీర్‌రెడ్డి :కడప లోక్‌సభ పరిధిలో ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు ఒకటి. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఆయన అన్న కుమారుడు భూషేశ్రెడ్డి ఉన్నారు. రామసుబ్బారెడ్డి టీడీపీను వీడి వైసీపీలో చేరినా, కీలక నేతలెవరూ ఆయన వెంట వెళ్లలేదు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న పని చేయాలన్నా డబ్బు ముట్టజెప్పాల్సిందే అనే చర్చ జరుగుతోంది. ఇసుక మాఫియా, భూకబ్జాలు, జమ్మలమడుగులో కిలో చికెన్‌పై 10 చొప్పున వసూలు ఎన్నికల్లో కీలకంగా నిలుస్తున్నాయి. వైసీపీ క్యాడర్‌లోనూ ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. చివరి అస్త్రంగా సొంతపార్టీ నాయకుల్నే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
నవనందుల నంద్యాల లోక్‌సభ - వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు - Nandyala Lok Sabha Constituency
పుత్తా చైతన్యరెడ్డి V/S రవీంద్రనాథ్‌రెడ్డి :కమలాపురంలో జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున మూడోసారి బరిలో దిగారు. గత రెండుసార్లు గెలిచినా నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదు. ఆయనకు టీడీపీ నుంచి పుత్తా చైతన్యరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరి నోట విన్నా 'హోరాహోరీ'నే అనే మాట వినిపిస్తోంది. రవీంద్రనాథ్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపనున్నాయి. పెండ్లిమర్రి మండలంలో భూముల ఆక్రమణ, వీరపునాయునిపల్లె మండలం చేపల చెరువులపై చర్చ జరుగుతోంది.