Pothole- Free AP Till Sankranthi CM Chandrababu Orders To Officers :రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నవంబరు 1 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఏ రోడ్డుపైనా గుంతలనేవి ఉండటానికి వీల్లేదని తెలిపారు. ఆర్‌అండ్‌బీ (R&B) పరిధిలోని రహదారుల్లో గుంతలు పూడ్చడానికి రూ.600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. అవసరమైతే మరో రూ.300 కోట్లు మంజూరు చేస్తామన్నారు. డ్రోన్లతో రహదారుల పరిస్థితిపై సర్వే చేయాలని సూచించారు. కేంద్ర సహకారంతో రూ.55 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని మరో రూ.30 వేల కోట్లతోనూ రోడ్ల నిర్మాణానికి అనుమతి వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. బుధవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, మరమ్మతులపై చర్చలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.
వైఎస్సార్సీపీ హయాంలో మరమ్మతులపై విచారణ :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారుల మరమ్మతులకు గిడ్డంగుల సంస్థ ద్వారా రుణం సమీకరించారని, ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ ఎకౌంట్ లేకుండా గుత్తేదారులకు బిల్లుల చెల్లింపునకు జీఓ విడుదల చేశారని అధికారులు కేబినెట్ దృష్టికి తెచ్చారు. గిడ్డంగుల సంస్థలో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదని, ఆ రుణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు.
అప్పట్లో టెండర్లు పిలిచి అప్పగించిన పనుల్లో 20 శాతం వరకు పూర్తయ్యాయని హెడ్ ఆఫ్ ఎకౌంట్ లేకుండా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై విచారణకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. బాధ్యుల్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి కూడా ఒకరున్నారన్న సమాచారంతో ఒకరిద్దరు అధికారులపై చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్‌శాఖలో దారుణ నిర్ణయాలు తీసుకున్నారని, టెండర్లపై రోడ్లు ఇస్తే అంతా ఆఫ్‌లైన్‌లో నడిపించేశారని సీఎం ఆరోపించారు. ఆర్థిక శాఖలో ఖాతా లేకుండానే ఇష్టానుసారం బిల్లులు ఇచ్చేశారన్నారు. వీటన్నింటిపై విచారిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
'వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్‌ప్రెన్యూర్' నినాదంతో ముందుకు : సీఎం చంద్రబాబు
దేశమంతా అనుసరించేంత గొప్పగా 6 పాలసీలు : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆరు కొత్త విధానాల గురించి మంత్రులకు సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆ విధానాలన్నీ చాలా సమగ్రంగా ఉన్నాయని మంత్రిమండలి అభినందించింది. అవి దేశం మొత్తం అనుసరించేంత గొప్పగా ఉన్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. వాటిపై చాలా విస్తృత కసరత్తు చేశామని, ఒక్కో పాలసీపై 40-50 గంటలు వెచ్చించామని సీఎం తెలిపారు.
Free Cylinders From Diwali Says CM Chandrababu :గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, దాన్ని తొలగించేందుకు రెండేళ్లు పడుతుందని అధికారులు కేబినెట్ దృష్టికి తెచ్చారు. యుద్ధప్రాతిపదికన ఆ చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకాన్ని దీపావళి నుంచి అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
గంజాయి బ్యాచ్‌లపైనా ప్రత్యేక షీట్లు :అనంతపురం జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డవాళ్లు గంజాయి మత్తులో ఆ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు వివరించారు. మరోసారి ఎవరూ అటువంటి ఘాతుకాలు చేయకుండా భయపడేలా దోషుల్ని కఠినంగా శిక్షించాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి, వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చేద్దామని సీఎం చెప్పారు. గంజాయి సేవించి పట్టుబడ్డవారిలో మార్పు వచ్చేలా సామాజిక సేవా శిక్షలు విధించాలని, వారి పేర్లు పది మందిలో నానతాయి కాబట్టి ఆ తర్వాతైనా వారు మారే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వంటి రద్దీ ప్రదేశాల్లో గంజాయి బ్యాచ్‌ల ఫొటోలు పెట్టాలని, రౌడీలపై రౌడీషీట్ల మాదిరిగా గంజాయి బ్యాచ్‌లపైనా ప్రత్యేక షీట్లు తెరవాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. లాలాజలాన్ని పరీక్షించి కూడా ఒక వ్యక్తి మాదకద్రవ్యాలు తీసుకున్నాడో లేదో నిర్ధారించే విధానం అందుబాటులోకి వచ్చిందని, దాన్ని ఇక్కడ కూడా వినియోగించాలని కొందరు మంత్రులు సూచించారు.
ఇసుక ధరలు తగ్గకపోవడంపై సీఎం ఆగ్రహం :రాష్ట్రంలో ఏ వాగులు, వంకలు, నదుల్లో నుంచైనా ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా తెచ్చుకోవచ్చని, దీనికి ఎవరు అడ్డుపడినా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇన్నాళ్లయినా, ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేసేందుకు అనుమతించినా ఇప్పటికీ ధరలు తగ్గకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి దీనిపై ఎలాంటి ఫిర్యాదులు ఉండటానికి వీల్లేదన్నారు. ప్రజలు తమ ఊళ్లకు సమీపంలోని వాగులు, వంకల నుంచి బళ్లు, ట్రాక్టర్లు వంటి వాహనాల్లో ఇసుక తెచ్చుకునేందుకు అనుమతిస్తే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ఉచిత ఇసుక విధానం ఉద్దేశం కూడా అదేనని, దాన్ని సమర్థంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదేనని సీఎం వారితో అన్నారు. గనుల శాఖ ఎంపిక చేసిన రీచ్‌లలో లోడింగ్ కోసం టెండర్లు పిలవగా కొందరు కావాలనే తక్కువ ధర కోట్ చేస్తున్నారని, ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నాక అక్రమంగా ఇసుక రవాణా చేయాలన్న దురుద్దేశం దానిలో కనిపిస్తోందని కొందరు మంత్రులు చెప్పారు. అలాంటివి సమీక్షించి రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక, మద్యం వ్యవహారాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యాన్ని సహించబోనని చంద్రబాబు మరోసారి గట్టిగా హెచ్చరించారు.
ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు - చంద్రబాబు ఆగ్రహం