Parliament Elections Campaign 2024 : సార్వత్రిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారబరిలో జోరు పెంచాయి. ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేశామంటూ కాంగ్రెస్ అభ్యర్థులు జనంలోకి వెళ్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వరంగల్ పార్లమెంటరీ పరకాల యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని కావ్య ఆరోపించారు.
Lok Sabha Elections 2024 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రైతుల్ని కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటి ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి బొగ్గు గనుల్లో తిరిగిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని గుర్తు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వెస్ట్ మారేడ్‌పల్లిలో సనత్‌నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.