Telangana Graduate MLC By Election Campaign 2024 :వరంగల్- ఖమ్మం- నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు.
కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం : ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్యమైన హస్తం పార్టీకి మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కూడా బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.
Telangana Graduate MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ, భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసన మండలికి పంపించాలని ఆయన కోరారు. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే అన్నారు.
ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్ : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.