EC Orders To CEO About Macherla MLA Pinnelli Ramakrishna Reddy Arrest :పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు, ఎట్టకేలకు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల కళ్లుగప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫల యత్నం చేశారు.
పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఈ ఘటనలో ఇప్పటి వరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై టీడీపీ నేత లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది.
లుకౌట్ నోటీసులు జారీ : పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు నమోదు చేశారు. ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు - ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం: సీఈవో - CEO MK Meena on Macherla Incidents
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించింది.
మరో కారులో పరారైన పిన్నెల్లి :పోలింగ్ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి తెలంగాణలోని సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి కాన్వాయ్‌ను పల్నాడు పోలీసులు వెంబడించారు. పోలీసుల కళ్లుగప్పి పిన్నెల్లి మరో కారులో పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బరితెగించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి- వీధిరౌడీని తలదన్నేలా ఈవీఎం ధ్వంసం - Pinnelli Destroy EVM