Pinnelli Brothers Anarchies in Macherla:ఆ మధ్య వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో విలన్ రాజప్ప చెప్పిందే వేదం. అతడి అరాచకాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఎన్నికల్లో అతడిపై ఎవరూ పోటీ చేయకూడదు. పోలీసులు అతడి అడుగులకు మడుగులొత్తుతుంటారు. సాధారణంగా వాస్తవంలో జరిగేదానికి కల్పన, అతిశయోక్తులు జోడించి సినిమాలు తీస్తుంటారు. కానీ పిన్నెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తే ఆ సినిమా తీసినవాళ్లే అవాక్కవుతారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు, దోపిడీ గురించి వింటే హడలిపోతారు.
పిన్నెల్లి సోదరులు గత ఐదేళ్లలో మాచర్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టగానే టీడీపీ మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమికొట్టారు. టీడీపీకి గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీవారిని గ్రామ బహిష్కరణ చేసి, కట్టుబట్టలతో తరిమేశారు. జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేయడంతో 60 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి.
పిన్నెల్లికి సజ్జల, పోలీసులు అన్ని విధాలా సహకరించారు : జూలకంటి బ్రహ్మారెడ్డి - Julakanti Interview with ETV Bharat
2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుడు చంద్రయ్యను వైఎస్సార్సీపీ నాయకులు పట్టపగలే నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు హత్య చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతో పాటు, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి పదవులన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి.
పిన్నెల్లి అరాచకాల అడ్డాగా మాచర్ల- కనుసైగతో నియోజవర్గాన్ని శాసించిన ఎమ్మెల్యే (ETV Bharat) ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి, ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఏకగీవ్రం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్లిన టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నల కారుపై నడివీధిలో ఎమ్మెల్యే అనుచరుడు కిశోర్ సెంట్రింగ్ కర్రతో దాడి చేయడం, వారి కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా గాయపరచడం సంచలనం సృష్టించింది.
2022 డిసెంబరు 16న మాచర్లలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'కార్యక్రమం తలపెట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. మాచర్లను రణరంగంగా మార్చేశారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, టీడీపీ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌రెడ్డి దాన్ని తెలుగుదేశం నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
'పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టి పిల్లిలా పారిపోయేరా' - పిన్నెల్లిపై నెట్టింట్లో ట్రోల్స్ - Social Media Trolls on Pinnelli
ఐదేళ్లలో మాచర్ల నియోజకవర్గాన్ని పిన్నెల్లి మనుషులు పీల్చిపిప్పి చేశారు. ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లో అక్రమ మద్యం వ్యాపారం మూడు సీసాలు, ఆరు గ్లాసులుగా వర్ధిల్లింది. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత షాపులు, బార్లకు తరలిస్తున్నారు. ప్రతి సీసాపై 60 నుంచి 120 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా తెలంగాణకు వెళ్లే గ్రానైట్ లారీల నుంచి ఎమ్మెల్యే మనుషులు 12 వేల రూపాయల చొప్పున కప్పం కట్టించుకుంటారు. ఎవరైనా మొండికేస్తే లారీ ఆ నియోజకవర్గం దాటకముందే అధికారులతో దాడులు చేయించి లక్షల్లో జరిమానాలు విధించేలా చేయిస్తారు.
ఐదేళ్లలో పల్నాడులో పనిచేసిన పోలీసులు పిన్నెల్లి సోదరుల అడుగులకు మడుగులొత్తారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడులు, హత్యలు, విధ్వంసాలతో నియోజకవర్గాన్ని రావణకాష్టంలా మార్చేసినా, వాటి వెనుక ఉన్నది పిన్నెల్లి సోదరులే అని తెలిసినా, ఏ రోజూ వారి జోలికి వెళ్లలేదు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచకాలపై టీడీపీ మద్దతుదారులెవరైనా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారిపైనే ఎదురు కేసులు పెట్టేవారు.
గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్య తర్వాత కిరాయి హంతకులతో వైఎస్సార్సీపీ నాయకుల్ని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగం మోపి, చంద్రయ్య బంధువుల్నే అరెస్ట్ చేసిన ఘనులు అక్కడి పోలీసులు. దుర్గి మండలం జంగమహేశ్వరపురంలో జల్లయ్య హత్య తర్వాత గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగుతుండగానే టీడీపీ నేతలపై దాడులు జరిగాయి.
ఇన్నాళ్లూ పిన్నెల్లి అరాచకాల్ని భరించిన సామాన్య ప్రజలే ఈ ఎన్నికల్లో తిరగబడ్డారు. సామాన్య మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడమే కాకుండా, ఎదిరించి, వెంబడించి తరిమేయడం అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఎమ్మెల్యే సోదరులు ఐదేళ్లుగా చేసిన అరాచకాల్ని ఇక భరించలేని పరిస్థితి ఏర్పడటం వల్లే ప్రజల్లో ఈ తెగువ వచ్చింది.
అక్కడ బతికిబట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో పిన్నెల్లిని ఓడించాలన్న కసి ప్రజల్లో కనిపించింది. నియోజకవర్గాన్ని ఇన్నాళ్లూ కనుసైగతో శాసించిన పిన్నెల్లి సోదరులు ప్రజల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారు. ఓటమి తప్పదన్న నిస్పృహతోనే ఎమ్మెల్యే ఈవీఎమ్ మిషన్‌ను పగలగొట్టారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అగమ్యగోచరంగా పిన్నెల్లి రాజకీయ జీవితం - ఏడేళ్లకు తగ్గకుండా శిక్షపడేనా? - Pinnelli Political Career