Young Man Wins International Medals in Sand Sculpture Competitions: ఇసుక కనపడిందా శిల్పంగా మలుస్తాడా ఓ యువకుడు. సముద్ర తీరంలో వివిధ ఆకృతుల్లో శిల్పాలను తయారుచేస్తూ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందాడు. చదువుకుంటూనే సైకత శిల్పాల పోటీల్లో అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. ఒడిశాలోని కోణార్క్ బీచ్‌లో 14వ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవాల్లో విజేతగా నిలిచాడు. ఇప్పటివరకు ఎన్నోరకాల శిల్పాలను రూపొందించి అందరి మన్నలు పొందుతున్నాడు. ఇంతకీ ఎవరా యువకుడు? విజయానికి కారణాలు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం.
తండ్రితో పాటు చేపల వేటకు: ఈ యువకుడి పేరు వాటుపల్లి గోపిచంద్. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం రాజుబంగారుపాలం పరిధిలోని అమీన్ నగర్ స్వస్థలం. ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మత్స్యకార కుటుంబం కావడంతో చిన్నతనంలో తండ్రితో పాటు వేటకు వెళ్లి అక్కడే ఇసుకపై శిల్పాలు వేయడం ప్రారంభించాడు. అయితే ఈ యువకుడిది నిరుపేద కుటుంబం. అయితేనేం విజయానికి అవన్నీ అడ్డురావని నిరూపిస్తున్నాడు. చదువుకుంటూనే మరోవైపు సైకత శిల్పాల పోటీల్లో రాణిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి అవార్డు, పతకాలు సాధించాడు.
దేశం గర్వించే స్థాయికి దీప్తి - ఎంతోమందికి స్ఫూర్తి
ఒడిశాలోని కోణార్క్ చంద్రబాగ్ బీచ్‌లో 2024 డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు 14వ అంతర్జాతీయ సైకత శిల్పం పోటీలు జరిగాయి. అందులో లండన్, జపాన్, మెక్సికో, రష్యా, శ్రీలంకతో పాటు మరో 11 దేశాలకు చెందిన 157 మంది కళాకారులు పాల్గొన్నారు. వారందరిని వెనక్కి నెట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి శిల్పం వేసి విజేతగా నిలిచాడు గోపిచంద్. తన గురువు సైకత శిల్ప బాలాజీ వరప్రసాద్ దగ్గర శిల్పాల వేయడంలో మెలకవలు నేర్చుకున్నాని చెబుతున్నాడు గోపిచంద్. ఒడిశాలో జరిగిన పోటీల్లో విజయం సాధించి అక్కడి మంత్రి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు 35వేల రూపాయల నగదు బహుమతి సాధించానని వివరించాడు.
తల్లిదండ్రులకు అండగా ఉంటూ పోటీల్లో సత్తా: చిన్నతనం నుంచే కష్టపడే మనస్వత్వం కలిగిన గోపిచంద్ నేడు అంతర్జాతీయస్థాయిలో రాణించడం సంతోషంగా ఉందంటున్నారు స్థానికులు. చదువుకుంటూనే తల్లిదండ్రులకు అండగా ఉంటూ సైకత పోటీల్లో సత్తాచాటాడు. అతన్ని మరింత ప్రోత్సహిస్తే భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధిస్తాడన్నారు. గత ఏడాది కృష్ణానది ఒడ్డున అక్షర యోధుడు రామోజీరావు సైకత శిల్పాన్ని తయారుచేసి ఘన నివాళులు అర్పించాడు. ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా మరో శిల్పాన్ని రూపొందించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నమూనాన్ని ఇక్కడ ఇసుకపై శిల్పాన్ని చెక్కి బహుమతి సాధించాడు.
గ్రామానికి గోపిచంద్ తీసుకొచ్చిన పేరుతో తమకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని చెబుతున్నారు గ్రామస్థులు. యువత అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మారుతున్న కాలనానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే భవిష్యత్తులో దేశానికి మరిన్ని పతకాలు, పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తానని చెబుతున్నాడీ యువకుడు.
అన్నమయ్య జిల్లా టూ అండమాన్ దీవులకు- టమాటాల ఎగుమతితో రైతన్నకు లాభాలు
విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ - క్రికెట్‌తో పరిచయం నుంచి వరల్డ్ కప్ వరకూ ప్రయాణం